ప్రధాన పార్టీలకు నువ్వా నేనా అన్న రీతిని తలపించే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధిక ఛైర్మన్ పీఠాలు దక్కించుకునేందుకు కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. అధికార తెరాస, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, విపక్షమైన భాజపా... ముఖ్య నేతల్ని ప్రచారానికి పంపుతోంది. గడువు సమీపస్తుండటం వల్ల ఓటర్లను కలుసుకునే పనిలో పడ్డారు.
పల్లా దిశానిర్దేశం...
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అధికార పార్టీ తరఫున ఎమ్మెల్యేలే అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి అనారోగ్యం వల్ల ప్రచారానికి దూరంగా ఉన్నా... మిగతా నాయకులంతా ఓటర్లను కలుసుకుంటున్నారు. భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, హుజూర్నగర్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో రెండు పురపాలికల చొప్పున ఉండటం వల్ల, ఉమ్మడి జిల్లా తెరాస ఇంఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్... ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ ఎన్నికల బాధ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి క్షేత్రస్థాయిలో చేయాల్సన పనులను శాసనసభ్యులకు తెలియజేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు మినహా మిగతా 11 చోట్లా అధికార ఎమ్మెల్యేలే ఉండటంతో... కిందిస్థాయి కార్యకర్తల్ని వారే సమన్వయం చేసుకుంటున్నారు.
ఉత్తమ్, కోమటిరెడ్డి సారథ్యంలో...
అటు కాంగ్రెస్ సైతం... కీలక నేతల్ని రంగంలోకి దించుతోంది. నల్గొండ, భువనగిరి ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారానికి సారథ్యం వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తున్న హస్తం పార్టీ... తాజాగా కోదాడ పురపాలికకు ఛైర్మన్ అభ్యర్థిని ప్రకటించింది. హుజూర్నగర్, కోదాడ, నేరేడుచర్లలో ఇప్పటికే ఒక దఫా ప్రచారం నిర్వహించిన పీసీసీ అధ్యక్షుడు... ఇప్పుడు మిర్యాలగూడ పురపాలికపై దృష్టిసారించారు. ఆలేరు, భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూరులో ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి సొంత నియోజకవర్గమైన నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ గెలుపుపై దృష్టిపెట్టారు. మిర్యాలగూడ, దేవరకొండలో పాగా వేసేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఏకైక ఎమ్మెల్యేతో ప్రచారం...
మరోవైపు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ భాజపా నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఆ పార్టీకున్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ నల్గొండలో ప్రచారం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్... నల్గొండ, దేవరకొండ, హాలియాలో ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెరాస, కాంగ్రెస్, భాజపా ముఖ్య నేతలంతా... ఉమ్మడి నల్గొండ జిల్లాలో తమ పార్టీల గెలుపే లక్ష్యంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు.
బస్తీమే సవాల్: కాలం మారింది..సెల్‌ఫోన్‌తో ఇస్మార్ట్ ప్రచారం..