Palla Rajeshwar Reddy on Palivela Issue: పలివెల ఘటనపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నారని తెరాస నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. తెరాస కార్యకర్తలపై దాడి చేసేలా.. భాజపా నేతలే వారి అనుచరులను రెచ్చగొట్టారని ఆరోపించారు. పలివెల ఘర్షణలో తెరాస శ్రేణుల చేతుల్లో రాళ్లు, కర్రలున్నాయని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఈ మేరకు ఈసీకి, పోలీసులు ఫిర్యాదు చేశామని.. దాడిలో ఎవరి తప్పుంటే వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
'తెరాస నేతలపై కావాలనే దాడి చేశారు. ఈటల ప్రసంగం తర్వాత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పలివెల ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. ఏ విజువల్ అయినా తీసుకోండి మా చేతుల్లో కర్రలు, రాళ్లు ఉన్నాయా.. భాజపా కార్యకర్తల చేతిలో కర్రలు, రాళ్లు ఉన్నాయా? ఒకవేళ మా నాయకుల చేతిలో ఉన్నాయని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. అదేవిధంగా భాజపా వాళ్ల చేతిలో కర్రలు ఉంటే కనీసం అదే పలివెల సెంటర్‌కి వచ్చి క్షమాపణ చెప్పే ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నాను.'-పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెరాస ఎమ్మెల్సీ
అసలేం జరిగిందంటే.. మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భాజపా, తెరాస కార్యకర్తలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. పలివెలలో ఓ వైపు భాజపా, మరోవైపు తెరాస ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పిడిగుద్దులతో ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నారు. భాజపా ప్రచార కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పైనా రాళ్ల దాడి జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇంత ఉద్రిక్తత చోటు చేసుకున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఈటల మండిపడ్డారు. ఈ ఘటనలో పలువురు గన్‌మెన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. ములుగు జడ్పీఛైర్మన్ కుసుమ జగదీశ్‌కు గాయాలయ్యాయి.
ఇవీ చదవండి: