జర్నలిస్టు రఘు (Journalist Raghu) కేసులో అదనపు కలెక్టర్, డీఎస్పీలపై జాతీయ బీసీ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఏదైనా ఘటన జరిగినప్పుడు విలేకరులు వాటిని చిత్రీకరిస్తారు? పార్లమెంటుపై దాడిని విలేకరులు చిత్రీకరించారు అది నేరమా అని జాతీయ బీసీ కమిషన్ సూర్యాపేట జిల్లా అధికారులను ప్రశ్నించింది. సూర్యాపేట జిల్లా గుర్రంబోడు భూముల కేసులో జర్నలిస్టు రఘును అరెస్టు చేసిన తీరుపై దిల్లీలోని కమిషన్ కార్యాలయంలో బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి నేతృత్వంలో చేపట్టిన విచారణకు సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పద్మజారాణి, డీఎస్పీ రఘు హాజరయ్యారు.
జర్నలిస్టు రఘు (Journalist Raghu) కుట్రపన్నినట్లు మీ దగ్గర ఆధారాలున్నాయా అని కమిషన్ సభ్యులు సూటిగా ప్రశ్నించారు. ఆయన భూముల్లోని షెడ్డును నాయకులకు చూపారని డీఎస్పీ బదులిచ్చారు. జర్నలిస్టులు అక్కడి నాయకులకు షెడ్డును చూపుతూ ప్రశ్నిస్తారని, అంతమాత్రానికే కేసులు పెడతారా అని నిలదీశారు. అక్కడ ఉన్న ఎంతమంది విలేకరులపై కేసులు పెట్టారని ప్రశ్నించారు. ఆ భూములు ఎవరివి? రఘుపై ఎవరు కేసు పెట్టారు? ఎప్పుడు అరెస్టు చేశారు? ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు? అరెస్టు సమయంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించారా..? అంటూ శరవేగంగా ప్రశ్నలు సంధించారు.
భూముల రక్షణకు ఫిర్యాదు అందలేదని, ఘర్షణ జరుగుతుందని తామే వెళ్లామని, ఆ భూములు ప్రైవేటు కంపెనీకి చెందినవని డీఎస్పీ తెలిపారు. ప్రైవేటు కంపెనీల భూముల రక్షణ కోసం వాళ్లు పిలవకుండానే మీరు వెళ్లారా అని కమిషన్ ప్రశ్నించింది. ఘర్షణలో పోలీసులకు గాయాలయ్యాయా అని ప్రశ్నించగా.. అయ్యాయని అందుకు సంబంధించిన ఫొటోలు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. మరి ప్రజలకు అయిన గాయాల రిపోర్టులు ఉన్నాయా అని ప్రశ్నించగా తమవి మాత్రమే ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. ప్రజలతో మీకు సంబంధం లేదా అని కమిషన్ ప్రశ్నించింది. ప్రైవేటు భూములకు మీ రక్షణ బాగుందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. కేసును మరోసారి విచారిస్తామంటూ వాయిదా వేసింది.
అసులు కేసు ఏంటి?
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలోని భూవివాదంలో పోలీసులు రఘుపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన ఆయనను ఈ నెల 3న హుజూర్‌నగర్ ప్రథమ శ్రేణి న్యాయస్థానం ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది. రఘు తరఫున న్యాయవాదులు మిర్యాలగూడ అదనపు సెషన్స్ న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం రఘుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇదీ చూడండి: JOURNALIST RAGHU: జైలు నుంచి బెయిల్పై విడుదలైన జర్నలిస్టు రఘు