Woman sarpanch allegations: ఎమ్మెల్యే ఒత్తిడి తట్టుకోలేక ఓ మహిళా సర్పంచ్ తన పదవికి రాజీనామా చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి... ఒత్తిళ్లకు తలొగ్గి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను తుంగలో తొక్కి... ఒక సర్పంచ్‌కి కల్పించిన అధికారాలను వారే లాగేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అయిన తనను నిత్యం అవమానాలకు గురిచేస్తున్నందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు వాపోయారు.
ఏం జరిగింది?
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం యల్లమ్మగూడెం సర్పంచ్ గాదె సంధ్యా విజయ్ రెడ్డి తన సర్పంచి పదవికి రెండోసారి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గతంలో కూడా తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆమె తెలిపారు. అందుకు నిరసనగా గతేడాది సెప్టెంబర్‌లో తన పదవికి రాజీనామా చేసినప్పటికీ... ఆమోదించకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి రాజీనామా చేయడానికి నల్గొండ కలెక్టరేట్‌కి వస్తే... అధికారులు ఎవరూ అందుబాటులో లేరని అన్నారు. చేసేది లేక కాసేపు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఇన్ వార్డులో తన రాజీనామా లేఖను ఇచ్చి వెళ్లారు.
నేను గతేడాది రాజీనామా చేశాను. కానీ ఆమోదించలేదు. మళ్లీ రాజీనామే చేసేలా చేస్తున్నారు. ఎమ్మెల్యే ఒత్తిళ్లను తట్టుకోలేకపోతున్నాను. నా అధికారాలను కూడా వారే లాగేసుకున్నారు. చెక్కుల మీద సంతకాలు పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రెండేళ్లుగా గ్రామంలో చేస్తున్న వివిధ పనుల చెక్కుల మీద పంచాయతీ సెక్రటరీ కూడా సంతకం చేయడం లేదు. పైగా నేనే సంతకం చేయలేదంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మాకు చేతికి ఇవ్వకుండా ఇంటి గోడకు అతికించారు. ఏడు రోజుల సమయం ఉన్నా మూడో రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే చేశాం. ఈ విధంగా అన్ని విషయాల్లోనూ మహిళనైన తనను అవమానిస్తున్నారు. గ్రామ పంచాయతీ మీటింగ్ ఉందని కూడా ముందు చెప్పడం లేదు. కేవలం వాట్సాప్ చేస్తున్నారు. అందుకే ఈ డమ్మీ సర్పంచ్‌గా ఉండడం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నాను. ఇక్కడ ఒక్క అధికారి లేరు. ఇన్‌వార్డులో ఇచ్చాను.
-గాదె సంధ్యా విజయ్ రెడ్డి, బాధిత మహిళా సర్పంచ్
ఇదీ చదవండి:CM KCR comments on Budget: పసలేని బడ్జెట్.. గోల్‌మాల్ బడ్జెట్: సీఎం