నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వజిరాబాద్ వత్సా తండా వద్ద నాగార్జునసాగర్ ముంపు గ్రామాల బాధితులు ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
అసలు విషయం ఏంటంటే..
పెద్దఅడిసేర్లపల్లి మండలం పెద్ద గుమ్మడం గ్రామస్థులకు పునరావాసం కింద వజిరాబాద్ వత్సా తండా వద్ద భూములు కేటాయించారు. మొత్తం 44 కుటుంబాలకు సర్వే నెంబర్ 430లో 22 ఎకరాల భూమిని ఇచ్చారు. అయితే ఈ భూములను కొందరు కబ్జా చేశారు.
దాడులకు పాల్పడుతున్నారు..
ఈ క్రమంలోనే తమకు కేటాయించిన భూముల కోసం గత 15 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే.. కబ్జాదారులు తమపై దాడులకు పాల్పడుతూ, అన్యాయంగా తమపై కేసులు పెడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులకు విన్నవించినా.. పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజులుగా తమ భూముల్లో టెంట్ వేసుకుని నిరసన తెలుపుతున్నామని వివరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.