నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 3500 చేనేత కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. 70 లక్షల విలువైన సామగ్రిని సమారు 3 నెలలకు సరిపడా అందించారు. చేనేత కుటుంబాల ఆకలి బాధను తీర్చేందుకు తన తల్లి సుశీలమ్మ పేరిట ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా రాజగోపాల్రెడ్డి ఈ వితరణ చేపట్టారు.
రాష్ట్రంలోనే మొట్టమొదటిది...
రాష్ట్రంలోనే మొట్టమొదటగా ఏర్పాటైన చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం చేనేత సహకార సంఘం వద్ద చేనేత కార్మికులకు సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. సహకార సంఘంలో అమ్మకాలు లేక నిల్వ ఉన్న కోటిన్నర రూపాయల విలువగల చేనేత వస్త్రాలను పరిశీలించారు. చేనేత కార్మికులు కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న నిరాహార దీక్షలకు సంఘీభావం ప్రకటించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళి...
చేనేత పితామహుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వ్యవసాయం, చేనేత రంగాలు రెండు కళ్ళలాంటివని మహాత్మ గాంధీ చెప్పిన విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. 5 నెలలుగా ఉపాధి లేక నిల్వ ఉన్న వస్త్రాలు అమ్ముడుపోక... ఆకలితో చేనేత కార్మికులు అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం...
గత కొన్ని రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నా సీఎం కేసీఆర్ చేనేత కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నారన్నారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో చేనేత కార్మికులకు అమలు చేస్తున్న ప్యాకేజీనే... రాష్ట్రంలోని ఇతర చేనేత కార్మికులకు అమలు చేయాలన్నారు.
సిరిసిల్లకే మంత్రి, ముఖ్యమంత్రా ?
ఒక్క సిరిసిల్లకే కేసీఆర్, కేటీఆర్లు ముఖ్యమంత్రి, మంత్రా అని నిలదీశారు. చేనేత కార్మికులకు జీవన భృతి కింద రూ. 25000 ఇవ్వాలని, నిల్వ ఉన్న చేనేత వస్త్రాలన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : ప్రగతి భవన్ ముట్టడికి బయలు దేరిన విపక్షనేతల అరెస్ట్