Stairs Climbing for Weight Loss: ప్రస్తుతం ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండేందుకు మెట్లు ఎక్కడం అనేది పాపులర్‌గా మారింది. ముఖ్యంగా వ్యాయామం చేయడానికి సమయం లేనివారు లేదా జిమ్ సదుపాయం లేని వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారు కూడా ఎక్కువగా మెట్లు ఎక్కడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, ఎన్ని మెట్లు ఎక్కడం వల్ల ఎంత బరువు తగ్గుతారో మీకు తెలుసా? ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, హెల్త్ ప్రచురించింది. "Effect of Stair Climbing on Cardiovascular Risk Factors in Young Adults" అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలో కురుక్షేత్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రోఫెసర్ డాక్టర్ మనోజ్ కుమార్ ధడ్వాల్ పాల్గొన్నారు.
ఈ అధ్యయనం ప్రకారం మెట్లు ఎక్కడం అనేది కేలరీలను కరిగించి బరువు తగ్గడడానికి, కండరాలను దృఢంగా చేయడానికి సాయపడుతుందని తేలింది. మెట్లు ఎక్కడం వల్ల శరీరంలోని కీలక కండరాలపై ఎక్కువ ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ లాంటి యాక్టివిటీలతో పోలిస్తే మెట్లు ఎక్కడం వల్ల ఎక్కువ కేలరీలు కరిగినట్లు వివరించారు. మెట్లు ఎక్కడం వల్ల నిమిషానికి సుమారుగా 8నుంచి 11 కేలరీలు కరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల సులభంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉందని తెలిపారు.
రోజుకు ఎన్ని మెట్లు ఎక్కాలి?
సాధారణంగా వారంలో ఐదురోజుల పాటు సుమారు 30 నిమిషాలు మెట్లు ఎక్కడం వల్ల బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఇది దాదాపు 500-700 మెట్లకు సమానమని వివరించారు. ఒకేసారి ఎక్కువ మెట్లు ఎక్కకుండా.. మొదటగా తక్కువ మెట్లతో ప్రారంభించి పెంచాలని సూచిస్తున్నారు. కేలరీలు కరగడానికి శరీర బరువు, ఎక్కిన సమయం లాంటి అనేక విషయాలు ప్రభావం చూపుతాయని తెలిపారు. సరైన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకునే వారు మెట్లు ఎక్కడం వల్ల రోజుకు 200-300 కేలరీలు కరిగినట్లు వివరించారు. ఫలితంగా వారానికి దాదాపుగా 200 గ్రాముల బరువు తగ్గుతారని చెబుతున్నారు.
మెట్లు ఎలా ఎక్కితే బెటర్?
అయితే, ఎలాంటి ప్రణాళిక లేకుండా మెట్లు ఎక్కడం వల్ల ఫలితాలు తక్కువగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం అనేది టెక్నిక్, నిలకడపైనా ఆధారపడి ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యంలోనే మెట్లు ఎక్కేటప్పుడు తీసుకోవాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం.
- మూడు నిమిషాల పాటు మెట్లు ఎక్కి తర్వాత విశ్రాంతి ఇవ్వాలి. ఆ తర్వాత మళ్లీ మెట్లు ఎక్కడం ప్రారంభించాలి. ఇలానే రిపీట్ చేస్తూ మొత్తంగా 30 నిమిషాలు చేస్తే సరిపోతుంది.
- మెట్లు ఎక్కే వేగాన్ని పెంచడం వల్ల ఎక్కువ కేలరీలు కరిగే అవకాశం ఉంటుంది.
- మెట్లు ఎక్కే క్రమంలో వెన్నుముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇంకా బ్యాలెన్సింగ్‌గా ఉండడం వల్ల కండరాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది.
- కండరాలపై ఎక్కువ ప్రభావం కావాలనుకునే వారు బరువులను మోస్తూ మెట్లు దిగొచ్చు. లేదా ఒక మెట్టును వదిలేసి మరోదానిపైకి ఎక్కాలని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయలా? ఈ 5 సింపుల్ టిప్స్ పాటిస్తే జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది!