New EV Policy in Telangana : దిల్లీ మాదిరిగా హైదరాబాద్‌లో కాలుష్యం కోరలు చాచకుండా ఉండేందుకు కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో 2020 నుంచి 2030 వరకు ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీని తీసుకొచ్చారని చెప్పారు. సుమారు 5 వేల వాహనాల వరకు రాయితీ ఇచ్చి ఆతర్వాత చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం వినియోగదారులకు అధిక లాభం చేకూరే విధంగా నూతనంగా ఈవీ పాలసీని తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈవీ పాలసీ వివరాలను వెల్లడించారు.
జీవో నంబరు 41 ద్వారా రెండేళ్ల వరకు ఈవీ పాలసీని తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పాలసీ 2026 డిసెంబరు 31 వరకు కొనసాగుతుందని అన్నారు. సోమవారం(రేపటి) నుంచి ఈ జీవో ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ అమల్లోకి వస్తుందన్నారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు పరిమితి లేదని చెప్పారు. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈవీ ప్రణాళికలు తీసుకువచ్చని పేర్కొన్నారు.
ఆ వాహనాలకు వంద శాతం మినహాయింపు : ఎలక్ట్రిక్ 4 వీలర్స్, టూ వీలర్స్, ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాలు, ఆటోలు, ఎలక్ట్రిక్ బస్సులకు టాక్స్‌తో పాటు రిజిస్ట్రేషన్ టాక్స్‌లో వందశాతం మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. తద్వారా వాహనదారులకు ఏడాదికి సుమారు రూ.లక్ష పైగా ఆదా అవుతుందని అన్నారు. హైదరాబాద్‌లో ఇప్పుడున్న మూడు వేల బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని వెల్లడించారు.
త్వరలో సిటీ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు : త్వరలోనే సిటీలో మొత్తం ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు తీసుకొస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అదనపు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కోసం ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ ఈవీ పాలసీ కేవలం హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే కాకుండా తెలంగాణవ్యాప్తంగా అమల్లో ఉంటుందని అన్నారు. ఈవీ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వండి.. భవిష్యత్ తరాలను కాలుష్యం నుంచి కాపాడండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
రూ.1 లక్ష బడ్జెట్లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే!