Uttam Kumar Reddy Latest Comments: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ఒకవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రజలలోకి వెళ్తోంది. తాము ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులు వివరిస్తూ మూడోసారి విజయ సాధించాలనే వ్యూహంతో అధికార పార్టీ నేతలు దూసుకెళ్తున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వంపై పోరాటాన్ని ముమ్మరం చేశాయి.
Uttam Kumar Comments on Congress Protest in Nalgonda : తామే ప్రధాన ప్రతిపక్షంగా పేర్కొంటూ ఎలాగైనా ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఆ పార్టీ నాయకులు హాథ్ సే హాథ్ జోడోయాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పార్టీ శ్రేణులంతా ఒక్కతాటిపైకి వచ్చి పోరాటం మొదలుపెట్టారనుకుంటే మరోసారి ఆ పార్టీని అంతర్గత కుమ్ములాటలు భయపెడుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల వర్గ విభేదాలతో పార్టీ శ్రేణులు సతమతమవుతుంటే తాజాగా మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నల్గొండలో చేపట్టే నిరసన కార్యక్రమాల విషయమై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
ఎంజీయూలో నిరుద్యోగ నిరసనపై నాకు సమాచారం లేదు: నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఈనెల 21న నిరుద్యోగ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ నుంచి కనీస సమాచారం లేదని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న తనతో చర్చించకుండా నిర్ణయం తీసుకోవడమే కాకుండా... అధికారిక సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆ విషయంలో అసంతృప్తితో ఉన్నట్లు తానెవరితోనూ చెప్పలేదన్న ఉత్తమ్... తనతో చర్చించి నిర్ణయం ప్రకటించి ఉండింటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కానీ తన పార్లమెంటు నియోజక వర్గం కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని గురించి మీడియా ద్వారా సమాచారం తెలుసుకోవాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.
నిరసన దీక్షలకు పిలుపునిచ్చిన రేవంత్‌రెడ్డి: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంలో చిన్నస్థాయి ఉద్యోగులను అరెస్టు చేసి... సిట్ చేతులు దులుపుకుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై పోరును ఉద్ధృతం చేస్తున్నామని ప్రకటించారు. ఈ నెల 21న మాహాత్మాగాంధీ యూనివర్సిటీలో, 24న ఖమ్మంలో, 26న ఆదిలాబాద్‌లో నిరసన కార్యక్రమాలు చేపడతామని రేవంత్ వెల్లడించారు. మే 4 లేదా 5 తేదీల్లో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మైదానంలో నిరుద్యోగుల భారీ బహిరంగసభ నిర్వహిస్తామని... ఆ సభకు పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ హాజరవుతారని తెలిపారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలిస్తామని ప్రధాని మోదీ... ఇంటికో ఉద్యోగమని సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని రేవంత్ మండిపడ్డారు.
ఇవీ చదవండి: