MP Komati Reddy helps Kushaiguda victim family: కుషాయిగూడ అగ్నిప్రమాదంలో మరణించిన నరేశ్ కుటుంబానికి అండగా ఉంటానంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హామీ ఇచ్చారు. తన పీఏ ద్వారా సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో ఉన్న నరేశ్ తండ్రికి 1లక్ష రూపాయలను అందించారు. మృతుని తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని తెలుసుకొని.. మరో రూ.25 వేలను తక్షణ సాయంగా అందించారు.

Kushaiguda Fire Accident news : అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి నరేశ్ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి.. వారికి ధైర్యం చెప్పారు. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడంతో మృతుల పెద్ద కుమారుడిని.. తన సొంత బిడ్డలా చూసుకుంటానని ఎంపీ మాట ఇచ్చారు. హైదరాబాద్లో టాప్ స్కూల్లో చదివించి.. అతడి చదువుకు అయ్యే ఖర్చునంతా తానే భరిస్తానని హామీ ఇచ్చారు. బాలుడి పేరు మీదనే ఆ లక్ష రూపాయలను పిక్స్డ్ డిపాడిట్ చేయమని నరేశ్ కుటుంబీకులకు ఫోన్లో చెప్పారు. ఏ కష్టమెచ్చినా.. కుమారుడిలా భావించి తనతో చెప్పుకోవాలన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు దిల్లీలో ఉండడం వల్ల రాలేకపోయానని బాధపడ్డారు. ఈ సందర్భంగా తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయాన్ని గుర్తు చేసుకొని వెంకట్ రెడ్డి కంటతడి పెట్టారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే: మరోవైపు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ కుషాయిగూడ బాధిత కుటుంబానికి రూ. 50,000 ఆర్థిక సాయం అందించారు. బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామని.. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Kushaiguda Fire Accident update : హైదరాబాద్లోని కుషాయిగూడలోని జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన నరేశ్(35), సుమ(35), జోషిత్(6) ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అగ్ని కీలలకు బలైపోయారు. ఈ ఘటనతో పెద్ద కుమారుడు ఒంటరివాడై.. తన నాన్నమ్మ తాతయ్యతో ఉంటున్నాడు. వారి ఆర్థిక పరిస్థితే చిన్నాభిన్నంగా ఉండడంతో.. వారికి దాతలు అండగా నిలుస్తున్నారు. ఈ ఘటనపై నరేశ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతుందని తెలిసినా సరే.. ఇళ్ల మధ్యలో టింబర్ డిపోను ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇవీ చదవండి: