నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తెరాస అధికారంలోకి వచ్చిన తరువాతే రెండు పంటలకు సాగు నీరు అందుతున్నాయని... రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఆయకట్టు చివరి భూములకు నీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. సాగర్ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
జానారెడ్డి చేసిందేం లేదు...
40ఏళ్లు ప్రజాప్రతినిధిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సాగర్‌లో చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. అందుకే 2018 శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఆయనని దూరం పెట్టారని ఎద్దేవా చేశారు.
భాజపాకు డిపాజిట్లు దక్కలేదు...
గత శాసనసభ ఎన్నికల్లో సాగర్ నియోజకవర్గంలో భాజపాకు డిపాజిట్ దక్కలేదని విమర్శించారు. అయినా వారిప్పుడు గెలుస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అసలు నోరు కుదరడం లేదని దుయ్యబట్టారు. సాగర్‌లో గెలవడం, దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచినంత సులువు కాదని అన్నారు.
అనేక సంక్షేమ పథకాలు...
7 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపట్టి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. దాంతో కాంగ్రెస్, భాజపాలు తట్టుకోలేక పోతున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రిపై భాజపా నేతలు నోరు పారేసుకుంటున్నారని, వాళ్లపై తాము ఎదురు దాడికి దిగితే తట్టుకోగలరా అని ప్రశ్నించారు. పార్టీ అదిష్ఠానం ఎవరికి టికెట్ ఇచ్చినా నాగార్జున సాగర్‌లో గెలుపు ఖాయమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్ర అధికారులకు పోలీస్ పతకాలను ప్రకటించిన కేంద్రం