Minister Jagadish Reddy: రైతులు కేవలం వరినే కాకుండా అధిక దిగుబడి, ఆదాయం ఇచ్చే ఆరుతడి పంటలు సాగుచేయాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆకాంక్షించారు. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఎడమ కాలువకు వానాకాలం పంట కోసం నీటిని ఆయన విడుదల చేశారు. ముఖ్యమంత్రి ఆదేశంతోనే నీటిని విడుదల చేశామని చెప్పారు. ప్రభుత్వం కృష్ణాజలాల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించడం వల్లే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు. చివరి ఆయకట్టు భూమి వరకు సాగునీరు ఇవ్వడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎగువన శ్రీశైలం నిండినందున ఈ సంవత్సరం సాగర్ ఆయకట్టు రైతులకు సాగునీటికి ఢోకా లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత జులైలో నీరు విడుదల చేయడం ఇదే తొలిసారి. ఎడమ కాలువ పరిధిలోని 6.50లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో 6.16 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సాగర్ జలాశయానికి గతేడాదితో పోలిస్తే అదనంగా నీరు వస్తోంది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నోముల భగత్, శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి , జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.
"చరిత్రలో ఎన్నడూ చేరని భూములకు నీరందిస్తాం. ఏ మేజర్లకు పేరు పెడతామో వాటన్నింటికి నీరు అందిస్తున్నాం. ఈ నీటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో రైతులు ఆలోచించాలి. రైతులు కేవలం వరినే కాకుండా అధిక దిగుబడి, ఆదాయం ఇచ్చే ఆరుతడి పంటలు సాగుచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం." - జగదీశ్‌రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి