Jagadish Reddy Fires On PM Modi: మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి పాలయ్యారనే అక్కసుతో ప్రధాని మోదీ.. సీఎం కేసీఆర్‌పై విషం చిమ్మారని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలు హంసలాంటి వారని.. నీళ్లు, పాలను వేరు చేసినట్టు విషాన్ని కూడా వేరు చేస్తారని తెలిపారు. గుజరాత్ ప్రజల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసపోరని చెప్పారు. నేతలు, పార్టీలను భయపెట్టి ఎదురులేకుండా చేసేందుకు భాజపా కుట్రలు పన్నుతోందని విమర్శించారు. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.
అబద్ధాల పునాదుల మీద పార్టీ విస్తరణకు ప్రధాని మోదీ యత్నిస్తున్నారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. భాజపా పీడ వదిలించేందుకు కేసీఆర్ నాయకత్వంలో ముందుకు వెళతామని తెలిపారు. రాష్ట్రానికి బ్యాంకు లోన్లు రాకుండా కేంద్రం అడ్డుకుంటుందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌పై విషం చిమ్మడం తప్ప ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిందేమీ లేదని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఎన్ని దుర్మార్గాలు చేసినా, కేంద్ర ప్రభుత్వం సంస్థలను అడ్డగోలుగా ఉపయోగించి మునుగోడుపై దాడి చేసినా.. మునుగోడులో ఓటమి పాలయ్యారని పేర్కొన్నారు.
ఎన్ని అక్రమాలు చేసినా మునుగోడులో ఓడిపోయామన్న అక్కసు తప్ప మోదీ మాటల్లో కొత్తగా కనిపించిందేమీ లేదని ధ్వజమెత్తారు. ఫలితంగా తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. మోదీ ఎప్పుడు వచ్చినా తెలంగాణకు ఒక్క రూపాయి ఇచ్చిన సందర్భం ఎప్పుడైనా ఉందా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డబ్బులు వడ్డీతో చెల్లిస్తానని అన్నారని.. ఇవ్వాల్సిన పైసలు ఇస్తే చాలని తెలిపారు. వడ్డీతో సహా మీరు ఇస్తానన్నది భారత దేశ ప్రజలే మీకు ఇస్తారు అని జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి: తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయి: ప్రధాని మోదీ
రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుల రిలీజ్.. భావోద్వేగంతో కన్నీళ్లు