పండుగ పూట ఆడపడుచులను ఇంటికి తీసుకొద్దామంటే మధ్య తరగతి కుటుంబాలు ఆలోచిస్తున్నాయి. ఒకవైపు పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలు (Petrol Diesel Hike) మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు మండిపడుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వినియోగదారులకు ఊపిరాడకుండా చేస్తూ మరోసారి వంట గ్యాస్ ధరతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి. సిలిండర్‌పై మరో రూ. 15ల భారం మోపారు. పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగింది.
రాయితీ ఊసేలేదు...
14.2 కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధర జులై నుంచి ఇంతవరకు నాలుగు దఫాలుగా మొత్తం రూ.90 పెంచడం గమనార్హం. తాజాగా దిల్లీ, ముంబయి నగరాల్లో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.899.50కి చేరుకోగా... హైదరాబాద్‌లో రూ. 952కు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ధరలు పెంచుతుండటంతో ఇక రాయితీ విషయం గాల్లో కలిసి పోయింది. ఈ ఏడాది జులైలో వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.25.50 పెంచారు. అనంతరం ఆగస్టు 17, సెప్టెంబర్ 1 తేదీల్లో రూ. 25 చొప్పున పెరిగింది. తాజాగా మళ్లీ పెంచగా వినియోగదారులపై మోయలేని భారం పడింది. రాయితీ, రాయితీయేతర సిలిండర్లపైన తాజాగా మళ్లీ ధర పెంచారు.
గరిష్ఠ స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు...
అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రో ఉత్పత్తుల ధరలు (Petrol Diesel Hike) దేశవ్యాప్తంగా అనేక చోట్ల గరిష్ఠానికి చేరాయి. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్ ధరలు దిల్లీలో రూ.102.94, ముంబయిలో రూ.108.96కి లీటర్ చేరగా.. హైదరాబాద్‌లో లీటర్‌పై 29 పైసలు పెరిగి 107.09కు, డీజిల్‌పై 38 పైసలు పెరిగి రూ.99.75కి చేరింది. రాష్ట్రంలోని 22 జిల్లా కేంద్రాల్లో డీజిల్ ధర లీటర్ వంద దాటింది. గడిచిన వారం రోజుల్లో ఒక్కరోజు మినహా మిగిలిన అన్ని రోజులు ధరలు పెరిగాయి. గతంలో నెలకు ఒక్కసారి మాత్రమే ధరలు పెరగగా.. 2017 జూన్ 6 నుంచి రోజువారీగా ధరల మార్పుకు కేంద్రం శ్రీకారం చుట్టింది.
52 శాతం పన్నులు...
నాలుగేళ్లకు పైగా ఈ విధానమే అమలులో ఉంది. ఈ ఏడాది జనవరి 1న లీటర్ పెట్రోల్ ధర (Petrol Diesel Hike) రూ. 87.08 ఉండగా.. ఈనెల 6కు వచ్చేసరికి రూ. 107.09కి చేరింది. ఇక లీటర్ డీజిల్ ధర రూ. 99.75లకు చేరింది. ఆ లెక్కన గడిచిన తొమ్మిది నెలల కాలంలో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోలుపై రూ.20.03 పెరిగింది. డీజిల్‌పై రూ.19.15 పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌పై సుమారు 59 శాతం, డీజిల్‌పై సుమారు 52 శాతం పన్నులు వసూలు చేస్తున్నాయి.
ఇదీ చదవండి: వర్షానికి కూలి ఇంటిగోడ.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. మరో ఇద్దరు...