Lemon Price Hike in Telangana : అక్టోబర్ నుంచి జనవరి వరకు అధిక వర్షాలు, మంచు, తేమ కారణంగా నిమ్మ పూత, పిందె దెబ్బతినడం.. తెగుళ్లు సోకడంతో దిగుబడిపై ప్రభావం పడింది. రాష్ట్రంలో 90 శాతం నిమ్మ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే సాగవుతోంది. ఇక్కడి నుంచే దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఉన్న రాష్ట్రంలోనే ఏకైక నిమ్మ మార్కెట్‌కు.. గత ఏడాది ఏప్రిల్, మే నెలలో రోజుకు 10 వేల బస్తాలు వచ్చేవి. ఈ ఏడాది 3 వేలకు మించకపోవడంతో... ఏమేరకు ప్రభావం పడిందో స్పష్టమవుతుంది.
Lemon Yield is Decreased in Telangana : ఉమ్మడి జిల్లాలో 30 వేల ఎకరాలలో నిమ్మ సాగు చేస్తున్నారు. గతంలో ఇక్కడి పంటలో 80శాతం వరకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతయ్యేది. ప్రస్తుతం 30 నుంచి 40 శాతం ఇతర రాష్ట్రాలకు తరలుతోంది. మిగతాది స్థానిక మార్కెట్ రిటైల్ అమ్మకాల కోసం వెళ్తోంది. దిగుబడులు తగ్గడంతో నిమ్మకు డిమాండు పెరిగింది.
Loss for lemon Farmers : వర్షాలు పడినా, ఎండలు తగ్గినా... నిమ్మ వినియోగంపై ప్రభావం పడుతుంది. ధర ఉన్నప్పుడే పంటను అమ్ముకోవాలని రైతులు భావిస్తున్నారు. పిందె దశలో ఉన్న పారుగాయాలను తెంపి.. మార్కెట్‌కి తీసుకొస్తున్నారు. కాస్త సైజులో ఉన్న కాయలకు ఈ సీజన్‌లో 25 కిలోల బస్తాకు.. 2500 నుంచి 3 వేల వరకు ధర పలుకుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పారుగాయ 700 నుంచి వెయ్యి రూపాయల వరకు ధర పలకడంతో.. పిందె దశలో ఉన్న కాయలను కూడా.. అమ్మటానికి మార్కెట్‌కు తీసుకొస్తున్నారు.
Loss for Telangana lemon Farmers : ఈ ఏడాది రుతుపవనాలు త్వరగా వచ్చే అవకాశం ఉండటంతో.. నిమ్మ రైతులు.. వీలైనంత తొందరగా.. పంటను మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. రోహిణీ కార్తె ప్రారంభమైనా.. వాతావరణం కాస్త చల్లబడటం... వారిలో ఆందోళన కలిగిస్తోంది.
"రెండేళ్ల నుంచి కోలుకోలేక నానా అవస్థలు పడుతున్న మేమంతా.. ఈ ఏడాది తక్కువ దిగుబడితో ఇంకా దిగులు పడ్డాం. కానీ ఇప్పుడు నిమ్మకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్ చూస్తుంటే ఓ వైపు సంతోషంగా ఉన్నా.. దిగుబడి బాగా వచ్చుంటే.. కాస్త పైసలు కూడబెట్టుకునే వాళ్లం. ఈ రేట్లతో మా కష్టాలు గట్టెక్కినట్లే కానీ మేం లాభపడినట్లు కాదు. నిమ్మ పంట దిగుబడి బాగా వచ్చినప్పుడు కూడా ఇదే గిట్టుబాట ధర ఉంటే మేం కాస్త లాభపడతాం. ఇప్పుడు కేవలం నిమ్మకు డిమాండ్ ఉండటం వల్లే మేం గట్టెక్కగలిగాం." -- నిమ్మ రైతులు, నల్గొండ జిల్లా