కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లి వద్ద రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ బిల్లును రద్దు చేసి, పంటలకు కనీస మద్దతు ధర గ్యారంటీ చేసే చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని అన్నారు.
రైతులను ఆదుకోవాలి
సన్నరకాలకు ప్రభుత్వం రూ. 2,500 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 1800 మద్దతు ధర కూడా మిల్లర్లు ఇవ్వడం లేదని దీని వల్ల రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు నష్టపోయిన పంటలకు ఎకరానికి కనీసం రూ.15000 ఇవ్వాలని అన్నారు. వరదల వల్ల పంట దిగుబడి తగ్గిపోయిన రైతులకు ప్రభుత్వం క్వింటాకు రూ. 500 బోనస్ ప్రకటించి వారిని ఆదుకోవాలని కోరారు.
కార్పొరేట్ పక్షపాతి
కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని నాయకులు ఆరోపించారు. కార్పొరేట్ వ్యవస్థను బాగు పరచడం కోసమే ఈ విధానం ప్రవేశపెట్టినట్లుగా ఉందని పేర్కొన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నామని, బిల్లును రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
రాస్తారోకో చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, వామపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సురక్షితంగా రోడ్డు దాటేలా ఆకాశ మార్గాలు..