Extra marital affair murder case in Nalgonda: సంతోషంగా గడుపుతున్న జీవితాల్లోకి అనుమానం అనే చీడ పురుగు ప్రవేశిస్తే కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయి. చీడపురుగు ఎలా అయితే మంచిగా ఉన్న చెట్లును చెద పెట్టి నాశనం చేస్తుందో అలానే మనిషి మనసులో అనుమానం అనే భావన ఏర్పడితే మన సంతోషంతో పాటు చుట్టు పక్కల ఉన్నవారి ఆనందాన్ని కూడా నాశనం చేస్తుంది. చీడ పురుగు పట్టిన తరవాత చెట్టుకి మిగిలేది చెద మాత్రమే అలానే మనిషికి చివరికి మిగిలేది అంధకారమైన జీవితం. అనుమానంతో ఉన్న కొంత మంది వ్యక్తులు ఎలాంటి దారుణాలు చేయడానికైనా వెనకాడరు. ఈ విధంగానే ఓ వ్యక్తి తన భార్య వేరే యువకుడితో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. దీన్ని తట్టుకోలేక కోపంతో ఆ యువకుడిపై కత్తితో దాడి చేశాడు. చివరికి ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం స్థానికులు ద్వారా తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలంలో జరిగింది.
ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం సర్వారం గ్రామానికి చెందిన పాపకంటి మసూద్ అలియాస్ మధు(35) తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అదే గ్రామానికి చెందిన శిర్రబోయిన శంకర్(27) తన భార్యతో గత కొంత కాలంగా చనువుగా ప్రవర్తించడం గమనించాడు. దీంతో శంకర్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడేమో అని మరింత అనుమానం పెంచుకున్నాడు. అనంతరం శనివారం మధ్యాహ్నాం సమయంలో శంకర్‌తో గొడవ పడ్డాడు. ఈ గొడవలో యువకుడిపై కత్తితో దాడి చేశాడు. చుట్టు పక్కల ఉన్న స్థానికులు ఆపడానికి ఎంత ప్రయత్నించిన మధుని అదుపులోకి తీసుకొచ్చేందుకు విఫలం చెందారు. ఈ సమయంలోనే ఆ యువకుడిపై కత్తితో తీవ్రంగా గాయపరిచాడు.
ఇది గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈరోజు తెల్లవారుజామున శంకర్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాధితుని కుటుంబం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయంలో పూర్తి సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
ఇవీ చదవండి: