నల్గొండ జిల్లాలో తెల్లబంగారానికి మంచి ధర లభిస్తోంది. మద్దతు ధర కంటే 2వేలు ఎక్కువగా చెల్లిస్తుడంటం వల్ల రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో పత్తికి భారీగా డిమాండ్ ఉన్నా అనుకున్న స్థాయిలో దిగుబడులు లేక మంచి ధర పలుకుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈసారి దిగుబడి గణనీయంగా తగ్గింది. గతేడాది ఎకరాకు 10 క్వింటాళ్లు వస్తే ప్రస్తుతం 5 క్వింటాళ్లు రాని పరిస్థితి నెలకొనడం వల్ల రైతులకు కాస్త మేలు కలుగుతోంది. పత్తి మద్దతు ధర రూ.6,025 పలుకుతోంది. వాస్తవానికి సీసీఐ కొనుగోలు చేసే సరకులో 8 నుంచి 12 శాతం తేమ ఉండాలి. కానీ 20 శాతం తేమతో కూడిన పత్తికి వ్యాపారులు, మధ్యవర్తులు రూ.7700 చెల్లిస్తుండగా కొన్ని మిల్లులు రూ.7900 వరకు ఇస్తున్నాయి. సోమవారం ఉదయం రూ.7600 ఉన్న ధర సాయంత్రానికి రూ.7700 కి చేరింది. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని కొంతమంది రైతులకు జిన్నింగ్ మిల్లులు అత్యధికంగా రూ.7900 వరకు చెల్లించాయి. ప్రస్తుత ధరల తీరు చూస్తే.. కొద్ది రోజుల్లోనే క్వింటా పత్తి 8 వేలు దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
నల్గొండ జిల్లాలో నెలరోజుల నుంచి పత్తి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు 2 లక్షల క్వింటాళ్లు విక్రయాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ధరలు రోజు రోజుకు పెరుగుతున్నందున రైతులు సరకును ఇప్పుడే అమ్మేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం ఎక్కడా సరకు లభ్యం కాకపోవడంతో.. విపరీతమైన డిమాండ్ ఏర్పడుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఆగస్టులో భారీ వర్షాలతో చాలా వరకు పత్తి పనికి రాకుండా పోయింది. పెట్టుబడులు, కౌలు ధరలు పెరగడంతో.. రైతన్నలు అయోమయంలో పడిపోయారు. ఈ తరుణంలో ప్రస్తుతం ధరల్లో పెరుగుదల నమోదు కావడంతో రైతులకు కాస్త ఊరట లభిస్తోంది.
నల్గొండ జిల్లాలో తెల్ల బంగారానికి డిమాండ్ ఏర్పడింది. క్వింటాల్ పత్తి ధర 8 వేల రూపాయలకు తాకే అవకాశం ఉంది. మద్దతు ధర కన్నా 2 వేల రూపాయలు ఎక్కువ పలుకుతుండటంతో ఈ ఏడాది సీసీఐ కొనుగోళ్లు లేనట్లేనని స్పష్టమవుతోంది. ఇప్పటికే సీసీఐ కేంద్రాలు ప్రారంభించక పోవటానికి ప్రధాన కారణం అధిక ధరలేనని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: