HC on Grandparents love for children : తల్లిదండ్రుల్లో ఒకరు మృతి చెందినపుడు మరొకరితో ఉన్న పిల్లలకు అవ్వ, తాతల ప్రేమ, అనురాగం, ఆప్యాయత అవసరమని హైకోర్టు పేర్కొంది. పెద్దల మధ్య వివాదం నేపథ్యంలో పిల్లలను వారితో కలవకుండా చేయడం సరికాదని పేర్కొంది. పిల్లల సంక్షేమం అంటే ఆర్థిక శ్రేయస్సు మాత్రమే కాదని, దీనికి సంబంధించి భిన్న కోణాలను చూడాలంది.
కుమార్తె మరణించడంతో నల్గొండ జిల్లాలో అల్లుడి వద్ద ఉన్న తన మనవరాలిని చూడటానికి కింది కోర్టు నిరాకరించడంతో అమ్మమ్మ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ చేపట్టి కీలక తీర్పు వెలువరించారు. న్యాయమూర్తి.. మనవరాలిని పిలిపించి మాట్లాడిన తరవాత పాప భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని అమ్మమ్మను కలవడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అత్త, అల్లుడి మధ్య విభేదాలతో మనవరాలికి అమ్మమ్మ ఆప్యాయతను దూరం చేయరాదని పేర్కొన్నారు. పిల్లల పెంపకం విషయంలో అవ్వ, తాతలు కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఆర్థికంగా తండ్రి బాగా ఉన్నప్పటికీ అదొక్కటే సరిపోదని, మనవరాలి జీవితంలో సన్నిహితులు, బంధాలు, ఇతర జ్ఞాపకాలు అవసరమన్నారు. తాత, అవ్వలు చెప్పే కథలు, వారు పంచే ప్రేమతో పిల్లలు పరిపూర్ణంగా ఎదుగుతారన్నారు.
అమ్మమ్మ, తాతలపై ద్వేషంతో పెంపకం కొనసాగితే చిన్నారి జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల అమ్మమ్మ ఆప్యాయత బాలిక శ్రేయస్సుకు ఉపయోగపడుతుందని పేర్కొంటూ వారానికి రెండు గంటలపాటు మనవరాలిని కలిసేందుకు ఆమెకు అనుమతిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చదవండి: