'పట్టణాల్లో హరితహారం మరింత జోరందుకోవాలి. గ్రామాల్లో మాదిరిగానే పట్టణాల్లో చిట్టడవులు పెంచాలి. పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించాలి. బడ్జెట్‌లో 10 శాతం మేర నిధులు దీనికోసమే ఖర్చు చేయాలి. నాటిన 80 శాతం మొక్కలు బతికేలా పాలకవర్గాలే చొరవ చూపాలి’.' ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా పురపాలికల అభివృద్ధిపై జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలివీ.
పాలకవర్గాలు, అధికార యంత్రాంగంలో చిత్తశుద్ధి లోపించడంతో కొన్ని పట్టణాల్లో కనీసం సగం శాతం లక్ష్యం కూడా చేరుకోలేదు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరపాలకం, వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీలు చాలా వెనుకంజలో ఉన్నాయి. దీనికి అనేక కారణాలూ ఉన్నాయి. గ్రామాల్లో హరితహారం కోసం ప్రత్యేకంగా నర్సరీలు ఉండటం కలిసి వస్తుంది. పట్టణాల్లో నర్సరీలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి మొక్కలు తెచ్చి నాటడంలో పాలకవర్గాలకు ఇబ్బందులు తప్పడం లేదు. పట్టణాల్లో అంతర్గత రహదారులన్నీ సీసీ రోడ్లు కలిగి ఉండటం కూడా ప్రతికూలంగా మారుతోంది. మొక్కలు నాటేందుకు స్థలాలు దొరకడం లేదు. రహదారులకు ఇరువైపులా నాటుతున్నా సరైన సంరక్షణ చర్యలు తీసుకోవడం లేదు.
లక్ష్యం కొండంత.. అమలు గోరంత
పూర్వ జిల్లాలోని ఎనిమిది పట్టణాల్లోనూ హరితహారం లక్ష్యం గతం కంటే రెట్టింపు ఉంది. గతంలో లక్ష్యం కంటే ఈ ఏడాది రెండింతలు, కొన్నిచోట్ల మూడింతలు లక్ష్యాలను అధికంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఇది కూడా హరిత యజ్ఞానికి ప్రతిబంధకంగా మారుతోంది. మొక్కలను భారీగా పట్టణ వాసులకు ఉచితంగా పంచిపెడుతున్నారు. వీటిని కూడా లక్ష్యంలో చేర్చుకుంటున్నాయి. కానీ వాటి సంరక్షణ బాధ్యతలను మాత్రం గుర్తెరగడం లేదు. పట్టణాల్లో ఇంటింటికీ అయిదు మొక్కలు పంపిణీ చేయాలి. కానీ ప్రజలు అడిగే పండ్ల మొక్కలు అందుబాటులో లేకపోవడంతో తీసుకునేందుకు స్థానికులు ఆసక్తి చూపడంలేదు. దీంతో పట్టణాల్లోని పార్కులు, అటవీ శాఖకు మొక్కలు అప్పగించి చేతులు దులుపుకొంటున్నారు.
ప్రస్తుత సీజన్ హరితహారం కార్యక్రమానికి ఉపకరిస్తోంది. ఈ సమయంలోనే విరివిగా మొక్కలు నాటాలి. ప్రస్తుతం కురిసే వర్షాలకు అవి బతుకుతాయి. సీజన్ దాటిన తర్వాత నాటినా ఫలితం ఉండదు. రహదారులకు ఇరువైపులా, డివైడర్లపై మొక్కలు నాటుతున్నా వాటికి రక్షణ కన్పించడం లేదు. కనీసం ట్రీగార్డులు ఏర్పాటు చేయడం లేదు. సంరక్షణ చర్యలు ఏమీ చేపట్టకుండా లెక్కల్లో మాత్రం చూపిస్తున్నారు.
సీజన్ దాటితే లక్ష్యం చేరుకోలేం
పురపాలికల్లో హరితహారం ఆశించిన మేర సాగడంలేదు. భద్రాద్రి జిల్లాలో ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాలోని పట్టణాల్లో సగం లక్ష్యాన్ని కూడా చేరుకోలేదు. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాం. మొక్కలు నాటడంపై దృష్టి సారించాలని ఉభయ జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఛైర్మన్లను ఆదేశించాం. పట్టణాల్లో ఉన్న ఖాళీ స్థలాలను పూర్తిగా వినియోగించుకోవాలి. అర్బన్ డెవలప్‌మెంట్ స్థలాల్లో విరివిగా నాటాలి. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేరుకోవాలి. -నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు మంత్రి పువ్వాడ అజయ్
ఇదీ చూడండి : ఈటీవీ భారత్ స్పందన: '‘పీఎం కిసాన్’'లో తెలంగాణకు చోటు