Handloom entrepreneur Manjula : తండ్రి మరణించినా తల్లి ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివారు. భావి పౌరులకు ఉత్తమ విద్యనందించేందుకు నాలుగేళ్ల పాటు పాఠశాలను నడిపారు. అనంతరం తన అభిరుచికి అనుగుణంగా కళాత్మక వస్త్రాలతో బొటిక్‌ను ప్రారంభించారు. 30 వేల పెట్టుబడితో వ్యాపారాన్ని మెుదలుపెట్టి, అంచెలంచెలుగా వృద్ధి చెందుతూ ప్రస్తుతం కోటి రూపాయల టర్నోవర్‌నూ సాధిస్తున్నారు. అంతేగాక 20 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నామంటున్నారు మంజులరాణి.
Handloom entrepreneur Manjula : మంజులారాణి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. తండ్రి మరణించినా తల్లి ప్రోత్సాహంతో పట్టుదలతో విద్యాభ్యాసం చేసి ఉన్నత విద్యావంతురాలైంది. పద్నాలుగేళ్లు ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించారు. భారతీయ కళలపై మక్కువతో, తన అభిరుచికి అనుగుణంగా కాటన్ వస్త్రాలను కళాత్మకంగా తయారు చేయించి అమ్మేందుకు బొటిక్‌ను ప్రారంభించారు.
స్థానిక కళాకారులకు ఉపాధితో పాటు నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరలో మహిళలకు అందిస్తూ బోటిక్‌కు మంచి ప్రాచుర్యాన్ని సాధిస్తున్నారు. కుమారుడి సహకారంతో చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని టెక్స్‌టైల్ పార్కులో సొంతం స్థలంలో సొంత బ్రాండ్‌తో దుస్తులు తయారు చేసి ఎగుమతి వ్యాపారం చేసేందుకు ముందడుగు వేస్తున్నారు.
Ayurvedic Industry : నాన్నమ్మే స్ఫూర్తిగా రూ.400 కోట్ల ఆయుర్వేద వ్యాపారం
Handloom entrepreneur Manjula : ఈసీఐఎల్‌లో ఎంప్రెస్ పేరుతో బొటిక్‌ను 2002లో ప్రారంభించారు మంజులరాణి. సూరత్, కలకత్తా, కోయంబత్తూరు, చీరాల నుంచి ముడి సరుకు తెప్పించి స్థానిక కళాకారులతో జర్దోజీ పని చేయించి చీరలు కళాత్మకంగా తయారు చేయిస్తున్నారు. దీంతో పాటు టైలర్లను సైతం నియమించి, వినియోగదారులకు నప్పే విధంగా కుట్టించడంతో మంచి పేరును సంపాదించుకున్నారు.
క్రమక్రమంగా వ్యాపారం పుంజుకుంటుందనుకున్న సమయంలోనే భర్త మరణం, అయినా కుంగిపోలేదు. బాధను గుండెలో దాచుకుని బొటిక్‌ను కొనసాగించారు. రూ.30 వేలతో వ్యాపారాన్ని ప్రారంభించి ప్రస్తుతం కోటికి పైగా వార్షిక టర్నోవర్ స్థాయికి చేర్చారు. పని చేసే వారిని సైతం చాలా చక్కగా చూసుకుంటారని అక్కడ పనిచేసే కూలీలు చెబుతున్నారు. వస్త్రాల నాణ్యత సైతం చాలా బాగుంటుందని ఎప్పుడూ ఇక్కడే తీసుకుంటామని వినియోగదారులు చెబుతున్నారు.
భూదాన్ పోచంపల్లిలో యూనిట్‌ను 2015లో ప్రారంభి, అనివార్య కారణాల వల్ల మల్కాపురంలో చేనేత, జౌళిశాఖ ద్వారా వెయ్యి గజాల స్థలాన్ని టెక్స్‌టైల్ పార్కులోనే కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇక్కడ కలకత్తాకు చెందిన నిపుణులు పది మంది, స్థానిక మహిళలు పది మంది ఉపాధి పొందుతున్నారని మంజులా రాణి తెలిపారు.చిన్ననాటి నుంచి ప్రకృతి అంటే చాలా ఇష్టమని, అందుకే సహజ సిద్ధమైన వస్ర్తాలకు ప్రాధాన్యతనిస్తున్నాని, భవిష్యత్‌లో దీన్నే కొనసాగిస్తానని మంజులా అంటున్నారు.
'మొదట ఒక టేబుల్‌తో చీరలు నేయడం ప్రారంభించాము. పోచంపల్లి వచ్చిన తర్వాత బొటిక్‌ను మొత్తం మూసేసి చేనేతపైనే దృష్టి పెట్టాము. కలకత్తా నుంచి తీసుకువచ్చి వారితో డిజైన్స్ వేయిస్తున్నాను. స్థానికులకు వారి దగ్గర నుంచి శిక్షణ ఇప్పిస్తున్నాము. భవిష్యత్తులో మొత్తం వ్యాపారంమంతా చేనేత వస్త్రాలకు సంబంధించిన వాటిపైనే ప్లాన్ చేస్తున్నాం.'- మంజులరాణి, సాయి ముద్రిక డిజైనర్స్ వ్యవస్థాపకురాలు
ఇవీ చదవండి: