gutha sukender reddy News : రాష్ట్ర వనరులను దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాల అస్థిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తోందని.. తెలంగాణకు రావాల్సిన నిధులు రాకుండా కుట్ర చేస్తోందని మండిపడ్డారు. భాజపా నాయకులు తెలంగాణ పరువుపోయే మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
gutha sukender reddy on BJP : ఫెడరల్ వ్యవస్థకు కేంద్రం తూట్లు పొడుస్తోందని గుత్తా విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నాయని అన్నారు. కొందరికి అధికార ధ్యాస తప్ప.. ప్రజాసంక్షేమం గురించి పట్టడం లేదని విమర్శించారు. అధికారంలోకి రావాలి.. ప్రజల్ని దోచుకోవాలనేదే ప్రతిపక్షాల లక్ష్యమని ధ్వజమెత్తారు.
"మనకు అభివృద్ధి ముఖ్యం. కులాలు కాదు. కాపులకు తెలంగాణ సర్కార్ హయాంలో సరైన న్యాయం జరుగుతోంది. రైతు బంధు ద్వారా కర్షకులకు సంక్షేమం లభిస్తోంది. కులాల పేరు చెప్పి కొన్ని పార్టీలు అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతున్నారు. ప్రజలు రాజకీయాలను నమ్మరు.. అభివృద్ధికి దాసోహమవుతారు. ప్రజలు.. పనిచేసే వారికే ఓట్లు వేస్తారు. తెలంగాణ సాధించిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఇంతలా అభివృద్ధి జరిగేది కాదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ అయింది. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష. రేపు ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేసేలా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం." -- గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్