Gutha Sukender Reddy comments on BJP : రాష్ట్రంలో భాజపా అరాచకాలు సృష్టిస్తోందని ఎమ్మల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని.. అధికార యావ తప్ప భాజపాకు మరో అజెండా లేదని సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. 317 జీవోపై భాజపా ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తోందని ఆరోపించారు. ఏడేళ్లుగా రాష్ట్రంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని.. భాజపా కుట్రలు చేసి రైతులను ఇబ్బందులు పెడుతోందని సుఖేందర్‌రెడ్డి ఆక్షేపించారు. బండి సంజయ్‌ని చూసి సీఎం కేసీఆర్ భయపడటం లేదని అన్నారు. భాజపాను చూసి ప్రజలే భయపడుతున్నారని.. ఆ పార్టీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని సంస్థలను అమ్ముకుంటూపోతున్నారని ఆక్షేపించారు.
రాష్ట్రాల అధికారాలను లాగేసుకొని... కేంద్రం ఏకఛత్రాధిపత్యం చేయాలని కుట్ర పన్నుతోంది. ఇది ప్రజాస్వామ్యానికే మంచిది కాదు. మోదీపాలన వల్ల దేశంలో అంతర్గత గొడవలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీల కోసం జీవో.317 వ్యతిరేకిస్తూ భాజపా ద్వంద విధానాన్ని అవలంబిస్తోంది. ఏడేళ్లుగా తెలంగాణ రైతులు చాలా సంతోషంగా ఉన్నారని.. ఇది ఓర్వలేక కుట్రలు చేసి రైతులను ఇబ్బందులు పెడుతోంది.
-గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలపై ఐటీ, సీబీఐ, సీఐడీ దాడులు చేస్తూ అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. భాజపా నిరంకుశ పాలనకు చరమ గీతం పాడే రోజులు దగ్గరపడ్డాయన్నారు. రైతుబంధు పథకంలో భాగంగా రూ.50 వేల కోట్లు పంపిణీ పూర్తి చేసుకున్న సందర్భంగా వారోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని.. ఊరూరా సంబురాలు జరుపుకోవాలని కోరారు. ఈనెల10న రైతు వేదికల వద్ద ఘనంగా రైతుబంధు వారోత్సవాలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: TS Sero-survey: రాష్ట్రంలో ప్రారంభమైన సిరోలెన్స్ సర్వే