రైతుల సంక్షేమం కొరకు ప్రత్యేక పథకాలు ప్రారంభించి ఆదుకున్నట్లే చేనేత కార్మికులనూ ప్రభుత్వం ఆదుకోవాలని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం కోరారు. రైతు బంధు మాదిరి చేనేత బంధు ప్రకటించాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా చండూరు మండలం చేనేత కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు బుధవారం హాజరై సంఘీభావం తెలిపారు. చండూరులోని జయశంకర్ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. చేనేత కార్మికులతో కలిసి ర్యాలీ చేపట్టారు.
రూ.లక్ష కోట్లు మించిన రాష్ట్ర బడ్జెట్‌లో నేతన్నలను ఆదుకోవటానికి కేవలం రూ.1,500 కోట్లు అవసరమమన్నారు. ఆ మేరకు ఖర్చు చేయలేని స్థితిలో ఉన్నామా అంటూ ప్రశ్నించారు. కుటుంబమంతా నెల రోజులు కష్టపడినా రూ.10 వేలు కూడా రావడం లేదన్నారు. కరోనా నేపథ్యంలో పని సాగక.. నిల్వలు పేరుకుపోయి వీరి పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల పక్షాన అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పోరాడతామన్నారు. కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వటంతో పాటు కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. కార్మికులు ఎంత మాత్రం అధైర్య పడొద్దని చెప్పారు.