Fake Diamonds Fraud in Nalgonda : జల్సాలకు, ఈజీ మనీకి అలవాటు పడిన ఓ ముఠా అమాయకులను టార్గెట్ చేసింది. తమ వద్ద విలువైన వజ్రాలు(Diamonds) ఉన్నాయని నమ్మించి.. ఓ ప్రత్యేక రసాయనాల్లో ముంచితే వజ్రాలకు రెట్టింపు ధర పలికి, రూ.కోట్ల వజ్రాలు మీ సొంతం అంటూ ఆశ చూపింది. ఈ రసాయనాల కొనుగోళ్లకు రూ.లక్షలు కావాలని నమ్మించి(Cyber Crime).. సినీ ఫక్కీలో పలువురి వద్ద నుంచి నగదును దండుకుని నయా మోసానికి తెరలేపింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో.. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం సీత్యాతండాకు చెందిన ఉషా నాయక్, బాలు, హైదరాబాద్‌కు చెందిన తాలిబ్ షేక్‌లు ఈజీ మనీ కోసం ముఠాగా ఏర్పడ్డారు. అందుకు అమాయకులను టార్గెట్ చేసుకున్నారు. వారి వద్ద విలువైన వజ్రాలు ఉన్నాయంటూ మిర్యాలగూడ, నాగార్జున సాగర్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో తిరుగుతూ పలువురిని మోసగించారు. ఈ క్రమంలో త్రిపురారం గ్రామానికి చెందిన నవ్య, శ్రీనివాస్ దంపతులు గతంలో మిర్యాలగూడలో గోల్డ్ షాపు నిర్వహించేవారు.
Fake Diamonds in Nalgonda : ఆ సమయంలో వీరికి ఉషా నాయక్, బాలులు పరిచయమయ్యారు. తమ వద్ద విలువైన వజ్రాలు ఉన్నాయంటూ.. వాటిని ముంబయి నుంచి తీసుకొచ్చే ప్రత్యేక రసాయనంతో శుభ్రం చేస్తే రెట్టింపు ధర వస్తుందని నమ్మబలికారు. భూమిలో పాతి విగ్రహాలను తీసినట్లు తమ వద్ద బంగారు నిధి ఉందంటూ నమ్మించి.. అమాయకుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారు.
విలువైన వజ్రాలు మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఓ గదిలో ఉన్నాయని నమ్మించి.. శ్రీనివాస్ వద్ద రూ.37.50 లక్షలు వసూలు చేశారు. అలాగే ధనావత్ మంగ్త వద్ద రూ.5 లక్షలు.. విజయ్‌కుమార్ అనే వ్యక్తి వద్ద రూ.40 లక్షలు వసూలు చేశారు. అప్పుడే ముంబయి నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక రసాయనాల్లో డైమండ్లు శుభ్రం చేస్తున్నట్లు నటిస్తూ.. అవి ఎంతకీ మారకపోవడంతో డైమండ్స్ బాక్స్ మారిందని సినీ ఫక్కీలో డ్రామాకు తెరలేపారు.
Telangana Cyber Crime News : ఎప్పటికీ వారు డైమండ్స్‌ను తీసుకురాకపోవడంతో గట్టిగా అడిగితే ఎవరి డబ్బులు వారికి ఇస్తామంటూ కాలం వెళ్లదీశారు. ఇలా అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరుగురి నుంచి సుమారు రూ.కోటి వరకు వసూలు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని.. పోలీసులు విచారణ ప్రారంభించారు.