కాంగ్రెస్ చేసిన అభివృద్ధి మాత్రమే సాగర్ నియోజకవర్గంలో కనపడుతోందని.. ఆరేళ్లుగా అధికారంలో ఉన్న తెరాస ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని మాజీ మంత్రి జానారెడ్డి విమర్శించారు. సాగర్ ఉపఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కలిసి పనిచేయాలని కోరారు. మాయమాటలు చెప్పి కేసీఆర్.. ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు మొండి చేయి చూపిస్తోందని ఆరోపించారు.
తిరుమలగిరి మండలంలో నెల్లికల్ లిఫ్ట్ పనులపై తాను సర్వే చేసిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో పనులు మొదలుకాలేదని జానారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే తెరాస ప్రభుత్వం కాగితాలపై సంతకాలు చేస్తుందని.. తర్వాత వాటిని విస్మరిస్తుందని ఎద్దేవా చేశారు. ఎప్పటికైనా ప్రాజెక్టు పనులు మొదలు పెట్టేది, పూర్తి చేసేది తామేనని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడం సంతోషంగా ఉంది'