Munugode By Poll Arrangements : రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తున్న ఈ ఎన్నికను సజావుగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేస్తోంది. సాధారణ పరిశీలకులతో పాటు పోలీసు, వ్యయ పరిశీలకులకు సంబంధించి ఐదుగురు అధికారులను నియమించింది. అభ్యర్థుల ఖర్చుపై గట్టి నిఘా పెట్టిన ఈసీ అందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో వీడియోగ్రాఫర్లను అందుబాటులో ఉంచింది.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఎవరైనా తమకు ఓటేయాలంటూ బల్క్ సందేశాలను పంపితే చర్యలు తీసుకుంటామని పార్టీలను హెచ్చరించింది. అలాంటి మెసేజ్‌లు వస్తే 76710 29272 నంబరుకు ఫిర్యాదు చేయాలని ఒక ప్రకటనలో ఓటర్లకు సూచించింది. ప్రతి ఓటరు ఓటు వేసేలా చర్యలు చేపట్టామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు.
నియోజకవర్గంలో 2లక్షల 41వేల 805 మంది ఓటర్లకు గాను అర్బన్‌లో 35, గ్రామీణ ప్రాంతాల్లో 263 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. 105 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి, 2వేల 651 మంది పోలీసులు, 15 కంపెనీల కేంద్ర బలగాలు అందుబాటులో ఉంచారు. సాయంత్రం 6 గంటలలోగా కేంద్రం లోపలికి వచ్చే ప్రతి ఓటరు ఎంత రాత్రయినా ఓటు వేసేలా చర్యలు తీసుకుంటామని వికాస్‌రాజ్ తెలిపారు.
పోలీసులు భద్రత: ప్రచారం చివరి రోజు పలు గ్రామాల్లో తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు భద్రత పెంచారు. మొత్తం 105 గ్రామాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. ఒక్కో గ్రామంలో కేంద్ర బలగాలతో పాటు క్లస్టర్‌ల వారీగా బాధ్యతలు అప్పగించిన ఇద్దరు ఎస్సైలు, ఒక సీఐ బందోబస్తు నిర్వర్తిస్తున్నారు.
చౌటుప్పల్, నారాయణపురం, నాంపల్లి, మునుగోడు మండలాల్లోని పలు గ్రామాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఎస్పీ రెమా రాజేశ్వరి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చౌటుప్పల్ మండలంపై భద్రతా పరిశీలకుడు మయాంక్ శ్రీవచన్ ఎక్కువ దృష్టి సారించారు.
నియోజకవర్గానికి దారితీసే చెక్‌పోస్టుల వద్ద పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. గత నెల 3న మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, 6న నల్గొండలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇవీ చదవండి: