నల్గొండ పట్టణానికి చెందిన ఓ విద్యాసంస్థల యజమానికి వారం కిందట కరోనా సోకింది. ఇతర వ్యాధులూ దానికి తోడవటంతో రెండు రోజుల కిందట ఆయన మరణించారు. ఆ కుటుంబానికి చెందిన వారికీ పాజిటివ్ రావడంతో వారు హైదరాబాద్‌లో హోంక్వారంటైన్‌లో ఉంటున్నారు. సంబంధిత ఇంటి యజమాని మృతిచెందారని తెలిసినా అంత్యక్రియలకు రాలేని పరిస్థితి. వారి కోరిక మేరకు నల్గొండలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో వైద్య సిబ్బందే ఆఖరి తంతును పూర్తి చేశారు.
సూర్యాపేట గ్రామీణ మండలానికి చెందిన ఓ యువకుడు కరోనాతో మృతిచెందారు. అప్పటికీ ఆ కుటుంబానికి చెందిన వారందరూ కరోనాతో బాధపడుతుండటంతో ఆయన అంత్యక్రియలను చేసేవారు లేకుండా పోయారు. చేసేదేమీ లేక కుటుంబ సభ్యుల అనుమతితో హైదరాబాద్‌లోనే ఎలక్ట్రిక్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపించారు.
యాదాద్రి జిల్లాకు చెందిన ఓ మహిళ అనారోగ్యంతో దవాఖానకు రాగా.. ఆమెకు కొవిడ్ పరీక్ష చేశారు. అందులో పాజిటివ్‌గా తేలింది. వైద్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి పంపించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ నాలుగైదు రోజుల అనంతరం మరణించారు. అక్కడికి సాధారణ వ్యక్తులను అనుమతించకపోవడం, అంత్యక్రియలు జరిపించడానికి కూడా దగ్గరి వారు అంతా కరోనాతో బాధపడుతుండటంతో ఆసుపత్రి వైద్యులే ఆ క్రతువును పూర్తి చేశారు. కుటుంబ సభ్యులకు ఆమె చివరి చూపు కరవైంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిత్యం పదుల సంఖ్యలో కేసుల నమోదుతో పాటు మృతులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే పరిణామం. ఇప్పటికే జిల్లా కేంద్రాలను దాటి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిన కరోనా ఒక్క విభాజ్య నల్గొండ జిల్లాలోనే ఇప్పటి వరకు 268 కేసులు పెరగడం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. జిల్లా కేంద్రంలో పదుల సంఖ్యలోకేసులు నమోదవుతున్నాయి. యాదాద్రి జిల్లాలో బుధవారం వరకు మొత్తం కేసుల సంఖ్య 79కి పెరగగా, సూర్యాపేటలో ఆ సంఖ్య 117కు చేరింది. దాదాపు 70 శాతం కేసులు ఈ నెల ఆరంభం నుంచి పక్షం రోజుల్లోనే నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
కరోనా సోకిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లా కేంద్రాసుపత్రుల్లో ప్రభుత్వం దాదాపు 100 ప్రత్యేక పడకలను ఏర్పాటు చేసింది. ఇందులో ఇప్పటి వరకు దాదాపు 80 శాతం పడకలు ఖాళీగానే ఉన్నాయి. అయినా కరోనా పాజిటివ్ వచ్చిన వారు కొంతమంది హైరానా పడి హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు దవాఖానాలు అత్యధికంగా రుసుం వసూలు చేస్తున్నాయి. పాజిటివ్ వచ్చినా భయపడకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటే తొందరగా కోలుకుంటారని పదేపదే వైద్యారోగ్య సిబ్బంది హెచ్చరిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం వ్యాధిపై ఉన్న భయంతో రాజధానికి పరుగు తీస్తున్నారు.
ఆ ఏడు మండలాల్లో...
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 71 మండలాల్లో కేవలం ఏడు మండలాల్లో మాత్రమే ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదు కాలేదని సంబంధిత వైద్యారోగ్య శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. విభాజ్య నల్గొండ జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన నేరేడుగొమ్ము, చందంపేట, డిండి, అడవిదేవులపల్లితో పాటు వేములపల్లి, మాడ్గులపల్లి మండలం సూర్యాపేట జిల్లాలో అనంతగిరి మండలంలో ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదు కాలేదు. ఈ మండలాలకు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చినా వారు వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించడం, లేదంటే స్వీయ నిర్బంధంలో ఉండటం లాంటివి ఇక్కడ కేసులు నమోదు కాకపోవడానికి కారణంగా తెలుస్తోందని సంబంధిత అధికారులు అభిప్రాయపడుతున్నారు. మే నెలాఖరు వరకు ఒక్క కేసు కూడా లేని యాదాద్రి జిల్లాలో ప్రస్తుతం 17 మండలాల్లోనూ కేసులు వెలుగు చూడటం గమనార్హం.