Congress Focus On Munugode By Elections: ప్రధాన పార్టీల దూకుడుతో మునుగోడులో నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రచారంలో వేగం పెంచింది. ఇతర ప్రధాన పార్టీల కంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించిన ఆ పార్టీ.. నియోజకవర్గాన్ని చుట్టేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మీ ఇంటి ఆడబిడ్డను ఆశీర్వదించండి అంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ, ఆడపడుచులకు బొట్టుపెట్టి గాజులు, కుంకుమ ఇచ్చి కాంగ్రెస్‌కు ఓటువేయాలని కోరుతున్నారు.
మునుగోడులో కార్యకర్తల సమన్వయ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ధరల పెంపుతో పేదలపై పెనుభారం మోపిన భాజపా మునుగోడులో గెలిచి.. తమ పార్టీకి ఎంతోబలం ఉందని భ్రమలు కల్పించే పనిలో ఉందని సీతక్క ఆరోపించారు. మరోసారి తెరాస, భాజపాలు గెలిస్తే పేదలభూములు లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తారని విమర్శించారు.
భాజపా, తెరాస ప్రజావ్యతిరేక పాలనకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మునుగోడు ఉపఎన్నికల్లో యూత్ జోడో -బూత్ జోడో కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు గాంధీభవన్‌లో జరిగిన యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భారత్ జోడో పాదయాత్ర, యూత్ జోడో... బూత్ జోడో, మునుగోడు ఉపఎన్నికలపై చర్చించారు.
"ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ చేసిందేమి లేదు. ఏ ఊరికి వెళ్లినా కానీ గోవర్ధన్‌రెడ్డి ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తర్వాత ఏ ఊరిలో కూడా అభివృద్ధి కాలేదు. ప్రతి గ్రామంలో నా మహిళల సోదరుల దగ్గరకి వెళ్లి ఓటు వేయమని వారిని అడుగుతున్నాను. వారి నుంచి అన్యూహమైన స్పందన వస్తోంది." - పాల్వాయి స్రవంతి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి
"ఓటు రూపేణా ఆరెండు పార్టీలకు వ్యతిరేకంగా మనం ఓటు వేసినప్పుడే మన సమస్యలకు పరిష్కారానికి ప్రభుత్వాలు ఆలోచన చేస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ఆందోళనలు చేసిన రాని ఫలితం.. ఒక్క మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి పంపిస్తే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. రేపు రాబోయే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది." - భట్టి విక్రమార్క సీఎల్పీ నేత
ఇవీ చదవండి: ఎన్ఐఏ సోదాలు.. నాంపల్లి కోర్టులో నలుగురిని హాజరుపర్చిన అధికారులు
వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
'మద్యం మత్తులో సీఎం.. కనీసం నడవ లేక ఇబ్బందులు.. విమానం నుంచి దించివేత!'