తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల పదో తేదీన నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు హాలియాలో నిర్వహించే బహిరంగసభలో ప్రసంగిస్తారు. అంతకు ముందు ఉదయం 10 గంటలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టును పరిశీలిస్తారు. 12.30 గంటలకు ఆయన నెల్లికల్లులో తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు. అటునుంచి హాలియాకు చేరుకుని సభలో పాల్గొంటారు.
అయిదు నియోజకవర్గాలు లబ్ధి పొందేలా
ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అయిదు నియోజకవర్గాల పరిధిలో... ఎత్తిపోతల పథకాలను ప్రారంభించనున్నారు. కేవలం నాగార్జునసాగర్‌కే పరిమితం కాకుండా... నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని అయిదు నియోజకవర్గాలు లబ్ధి పొందేలా ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. హుజూర్నగర్ పథకాలకు నిధులు మంజూరు చేస్తూ శుక్రవారమే ఆదేశాలు రాగా... దేవరకొండ, ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో వచ్చే అవకాశముంది. సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, మునుగోడు నియోజకవర్గాలు లబ్ధి పొందేలా... లిఫ్టులు మంజూరయ్యాయి.
వీటితోపాటే పూర్తి చేయాలని
ఉప ఎన్నిక జరిగే నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నెల్లికల్, కుంకుడుచెట్టు తండా లిఫ్టులను ఇప్పటికే ప్రకటించగా... హాలియా డిగ్రీ కళాశాలకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. దేవరకొండ పరిధిలోని అంబా భవాని, కంబాలపల్లి, పెద్దగట్టు, అంగడిపేట, పొగిళ్లతోపాటు... మిగతా ప్రాంతాల్లో ఎత్తిపోతల నిర్మాణాలు జరగనున్నాయి. ఇందుకోసం రూ.3,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక సందర్భంగా హామీ ఇచ్చిన ఎత్తిపోతల పథకాల్ని వీటితోపాటే పూర్తి చేయాలన్న భావనతో... ఆ నియోజకవర్గానికి రూ.1,217.71 కోట్ల నిధుల్ని మంజూరు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. మొత్తంగా అన్ని పథకాలు పూర్తయితే ఉమ్మడి జిల్లాలో... 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది.
చివరి ఆయకట్టుకు నీరిచ్చేందుకు
సాగర్ టెయిల్ ఎండ్తోపాటు ఇప్పటివరకు నీటి వసతి లేని ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా... ఎత్తిపోతల పథకాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ముక్త్యాల ఎత్తిపోతలకు రూ.817.50 కోట్లు మంజూరవగా... చింతలపాలెం మండలం వెల్లటూరు సమీపంలో కృష్ణానది వద్ద నిర్మించనున్నారు. పాలకవీడు మండలంలో చివరి ఆయకట్టుకు నీరిచ్చేందుకు జాన్ పహాడ్ ఎత్తిపోతలకు రూ.118.70 కోట్లు మంజూరవగా... గుండెబోయినగూడెం వద్ద ఎత్తిపోతల ఏర్పాటు చేసి జాన్ పహాడ్ బ్రాంచి కాలువకు నీరు సరఫరా చేస్తారు. ముక్త్యాల బ్రాంచి కాలువ ఆధునికీకరణకు రూ.184.60 కోట్లు... జాన్ పహాడ్ బ్రాంచి కాల్వ ఆధునికీకరణకు రూ.52.11 కోట్ల మంజూరుకి ఆదేశాలు వచ్చాయి.
దీటైన అభ్యర్థిని నిలపాలని చర్చ
వీటితోపాటు సాగర్ ఎడమకాల్వ లైనింగ్ పనులకు గాను... రెండు ప్యాకేజీలుగా నిధులిస్తున్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి బరిలోకి దిగనున్నారన్న వార్తలతో... అందుకు దీటైన అభ్యర్థిని నిలపాలన్న చర్చ చూచాయగా వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష పార్టీకి గట్టి జవాబు ఇవ్వాలంటే... సీనియర్ నేతల్ని రంగంలోకి దించితే ఎలా ఉంటుందన్న అభిప్రాయాల్ని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. నిఘా వర్గాలు, పార్టీ నేతలు, వేర్వేరు సంస్థల అంతర్గత సర్వేల ద్వారా ఇప్పటికే సమాచారం సేకరించిన తెరాస అధిష్ఠానం... అందుకు సంబంధించిన కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై జిల్లా ముఖ్య నేతను అడిగినట్లు తెలుస్తోంది.
స్థలాల క్రమబద్ధీకరణకు ప్రకటన చేసే అవకాశం
ఈ నెల 10న మధ్యాహ్నం హాలియాలో నిర్వహించే సభకు... రెండు లక్షల మంది వచ్చేలా జన సమీకరణ చేయాలని పార్టీ నేతలకు సూచనలు అందాయి. నాగార్జునసాగర్‌లో అపరిష్కృతంగా ఉన్న స్థలాల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సాగర్ ఉప ఎన్నికలో ఓట్లు రాబట్టుకునేందుకు చేపట్టే వ్యూహాల్లో... ఎన్నెస్పీ స్థలాల అంశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సాగర్‌లో ఉన్న నిర్మాణాలు ప్రాజెక్టు పరిధిలోనివి కాగా... ఇంతకాలం రెవెన్యూకు ఎలాంటి సంబంధం లేని భూములవి. అయితే నందికొండ పురపాలికగా అవతరించాక... ఆ భూముల అధికారాలు కలెక్టరుకు బదిలీ అయ్యాయి.
రిజిస్ట్రేషన్లు లేకున్నా
పదవీ విరమణ చేసినవారంతా ఇప్పటికీ అవే భవనాల్లో ఉంటూ... రిజిస్ట్రేషన్లు లేకున్నా నిబంధనల ప్రకారం అద్దె చెల్లిస్తూ నెట్టుకొస్తున్నారు. ఆ క్వార్టర్లను తొలగించి భూముల్ని గజాల లెక్కన విక్రయించేందుకు... నీటిపారుదల శాఖ గతంలోనే సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో భూముల అమ్మకానికి హాలియా సభ ద్వారా ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారన్న భావన... అధికార పార్టీ శ్రేణులతోపాటు సాగర్ వాసుల్లో కనిపిస్తోంది.
ఇదీ చదవండి : సుందరం.. భక్తిపారవశ్యం... యాదాద్రి పుణ్యక్షేత్రం