నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో కొత్తగా 4 లక్షల 91 వేల పైచిలుకు మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు త్వరలో జరగబోయే ఎన్నికల కోసం డినోవా విధానంలో ఓటర్ల జాబితాను రూపొందించింది.
మూడు జిల్లాల పరిధిలో మొత్తం 4 లక్షల 91వేల 396 మందికి పట్టభద్రుల ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హత లభించిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ జాబితాలో పురుషులు 3 లక్షల 23వేల 377 మంది కాగా.. మహిళలు లక్షా 67వేల 947 మంది ఉన్నారు. ఇతరుల సంఖ్య 72 గా ఉంది. డిసెంబర్ ఒకటో తేదీన ఎన్నికల సంఘం ముసాయిదా ప్రకటించిన తర్వాత కొత్తగా 16 వేల12 మంది ఓటర్లు చేరారు. మరో 860 మందిని జాబితా నుంచి తొలగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు నమోదు చేసుకున్నవారిలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 88 వేల 351 మంది ఓటర్లుండగా అత్యల్పంగా ములుగు జిల్లాలో 9 వేల 890 మంది ఉన్నారు. పట్టభద్రుల ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 జిల్లాల్లో 546 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: వాట్సాప్ బదులు వేరే యాప్ వాడండి: హైకోర్టు