పోడు భూముల పరిరక్షణకు భాజపా కృషి చేస్తున్నందుకు పోడు రైతులు మద్దతు తెలుపుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితాలే నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పునరావృతమవుతాయని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన "ప్రజాస్వామ్యానికి సంకెళ్లు" అనే సమావేశానికి బండి సంజయ్ హాజరయ్యారు. గిరిజన భూముల్లో రేకుల షెడ్‌ను కాపాడాల్సిన అవసరం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏముందని ప్రశ్నించారు. పోడు రైతులకు మద్దతుగా పోరాడుతున్న భాజపా కార్యకర్తలపై కేసులు పెట్టడం దారుణమన్నారు. కేంద్రంలో ఉన్న తమకే రక్షణ లేనప్పుడు.. సామాన్యుల పరిస్థితేంటని ఆవేదన వ్యక్తం చేశారు. భైంసా అల్లర్లలో 20 మంది అమాయకులపై కేసులు పెట్టడం అన్యాయమని ఆరోపించారు.
బుద్ధి చెప్పాలి..
సీఎం కేసీఆర్ చేసిన తప్పులకు ఇద్దరు జిల్లా కలెక్టర్లు సస్పెండ్ అయ్యారని సంజయ్ మండిపడ్డారు. అమరవీరుల త్యాగాలపై భోగభాగ్యాలు అనుభవిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సాగర్ ఉపఎన్నికలో బుద్ధి చెప్పాలని సూచించారు.
ఏ హామీ నెరవేర్చలేదు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని ఆ పార్టీ నాయకుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. న్యాయవాద దంపతులను దారుణంగా హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేేశారు. నియంతృత్వ పాలనను అంతం చేయడానికి భాజపా పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'పెట్రోల్, డీజిల్ ధరల పాపం కేంద్ర ప్రభుత్వానిదే'