BJP Leaders reacts on Munugode result: మునుగోడులో తెరాస విజయం సాధించడంపై భాజపా నేతలు ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయినా అక్కడ తమ పార్టీ నైతికంగా విజయం సాధించిందని వారు పేర్కొన్నారు. చావుతప్పి కన్నులొట్టపోయినట్లు వామపక్షాల భిక్షతో తెరాస విజయం సాధించిందని ఎద్దేవా చేశారు. డబ్బుతో ప్రలోభ పెట్టామని తెరాస తమపై దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు.
మునుగోడులో రాజగోపాల్ రెడ్డి నైతికంగా విజయం సాధించారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ కంచుకోటలో భాజపా సత్తా చాటిందని ఆయన పేర్కొన్నారు. వామపక్షాల భిక్షతో తెరాస గెలిచిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయని తెలియగానే... సూది, దబ్బడం పార్టీ నేతలను సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారని దుయ్యబట్టారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకోవడం కేసీఆర్‌కు అలవాటని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. 33 గిరిజన తండల్లో ఉన్న 13వేల ఓట్ల కోసం గిరిజన రిజర్వేషన్ ప్రకటించారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఎల్బీనగర్‌లో స్థలాలు రెగ్యులరైజ్ చేశారని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. పోలీసులు ఉప ఎన్నికలో చట్టానికి లోబడి పనిచేయలేదని మండిపడ్డారు.
'కేటీఆర్ గారి మాటలు వింటుంటే... దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. ఎంతో కసితో, దుర్మార్గంతో మాపై దాడులు చేశారు. డబ్బుతో ప్రలోభ పెట్టామని తెరాస మాపై దుష్ప్రచారం చేసింది. కాంగ్రెస్ కంచుకోటలో భాజపా సత్తా చాటింది. మునుగోడు ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. హుజురాబాద్‌లో నన్ను ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేశారు. 35 వేల గొల్ల కురుమల ఓట్ల కోసం ఖాతాల్లో డబ్బులు వేశారు.'-ఈటల రాజేందర్, హుజురాబాద్ ఎమ్మెల్యే
కేటీఆర్ ఫెయిల్డ్ లీడర్.. హరీశ్‌రావు కాంపిటేటివ్ లీడర్: మునుగోడులో కమ్యూనిస్టులు, పోలీసులు విజయం సాధించారని మాజీ ఎంపీ వివేక్ విమర్శించారు. తెరాస వామపక్షాలు, పోలీసులను వాడుకోవడం.. ఎంపీలు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి ప్రచారం చేయడంతోపాటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని ఆయన ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో 65 నుంచి 70 సీట్లతో గెలుస్తామని వివేక్ ధీమా వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు అవాస్తమని కొట్టిపారేసిన ఆయన.. కేటీఆర్ ఫెయిల్డ్ లీడర్ అని.. హరీశ్‌రావు కాంపిటేటివ్ లీడర్‌గా పేర్కొన్నారు.
గట్టుప్పల్ ఇంఛార్జీగా ఉండి కేటీఆర్ మెజార్టీ తీసుకురాలేదని... అదే హరీశ్ మర్రిగూడెంలో భారీ మెజార్టీ తీసుకువచ్చారని వివేక్ తెలిపారు. గుజరాత్ నుంచి హవాలా డబ్బు తెచ్చింది ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. కోకాపేటలో కార్యాలయం కోసం స్థలం కొనుగోలు చేశానన్న వివేక్... కేటీఆర్ చూపెట్టిన ఆ అగ్రిమెంట్ కాపీలో తప్పేముందని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం బయటకు వస్తుందన్నారు. పఠాన్‌చెరులో కంపెనీని మూసివేసి... తనపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు.
ఇవీ చదవండి: