తెరాసకు ఓటమి భయం పట్టుకుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా... పెద్దవూర మండలంలోని వెల్మగూడెం, గర్నెకుంటా, పెద్దవూర, సంగారం, ఫోతునూర్, పులిచర్ల, పర్వేదుల, తుమ్మచెట్టు, చలకుర్తి, కుంకుడు చెట్టు తండా గ్రామాల్లో పర్యటించారు. నల్లా నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెప్పిన సీఎం కేసీఆర్... ప్రజల ముందుకు ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా... మాటలతోనే పూట గడుతున్న కేసీఆర్‌ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా? అని సంజయ్ సవాల్ విసిరారు. తాము ప్రజల కోసం పోరాడుతుంటే తమపై కేసీఆర్ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. మద్యం, డబ్బులు పంచి తెరాస, కాంగ్రెస్ గెలవాలని చూస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు ఆలోచించి భాజపా అభ్యర్థి రవికుమార్‌ను గెలిపించాలని కోరారు.