BJP Focus On Munugode By Elections: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న భాజపా జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు సిద్దమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే మునుగోడును సెమీ ఫైనల్‌గా భావిస్తున్నతరుణంలో ప్రచార కార్యక్రమాల ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం, అధికార తెరాసను ఓడించాలంటే ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్నదానిపై జాతీయ నాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోదీ సంక్షేమ పాలనను ప్రజల ముందు ఆవిష్కరించడంతో పాటు.. తెరాస వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని నిర్ణయించింది.
పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రులు ఒక్కొక్కరుగా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. గతంలో జ్యోతిరాదిత్య సింథియాతో పాటు మరికొంత మంది కేంద్ర మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి వెళ్లారు. ప్రజల నుంచి స్పందన ఉన్నందున మరింత ఉద్ధృతంగా నిర్వహించాలని జాతీయ నాయకత్వం యోచిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం సాధించడానికి అవసరమైన రూట్ మ్యాప్‌ను కేంద్రమంత్రులు సిద్ధం చేసి వెళ్తున్నారు. మొక్కుబడిగా పర్యటనలా కాకుండా ప్రతీనెల రెండు నుంచి మూడురోజల పాటు వారికి కేటాయించిన నియోజక వర్గాలను చుట్టేస్తున్నారు.
మునుగోడులో భాజపా జాతీయ నాయకులు, కేంద్రమంత్రులతో ప్రచారం చేయించాలని అందుకు సంబంధించిన షెడ్యూల్ సైతం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నోటీఫికేషన్‌తో సంబంధం లేకుండా నేతలు మునుగోడులో పర్యటించేలా ప్రణాళిక తయారుచేశారు. మండలాల వారీగా ఓటర్లను ఆకర్షించేందుకు గల అవకాశాలపైనా జాతీయ నాయకత్వం లెక్కలు వేసుకుంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభతో మునుగోడు ఉప పోరుకు సమరశంఖం పూరించారు. ఆ వేడిని ఏ మాత్రం తగ్గకుండా రాష్ట్ర నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నెలాఖరులో మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇవీ చదవండి: ఊపందుకున్న 'మునుగోడు' రాజకీయం.. ఇంటింటికీ పార్టీల ప్రచారం..!
మునుగోడు ఉపఎన్నికలో తెరాసకే మా మద్దతు: తమ్మినేని వీరభద్రం
మునుగోడు ప్రచారానికి ముహుర్తం ఖరారు.. హస్తం నేతల్లో హుషారు...