పెళ్లీడుకొచ్చిన బిడ్డకు సంబంధాలు చూడడం మొదలు పెట్టాము. కొద్దిగా అనారోగ్యంగా అనిపిస్తే వైద్యం చేయించాము. తగ్గింది అనుకునేలోపే మరళా తిరగబెట్టింది. పరీక్షలు చేయించగా క్యాన్సర్ అని తెలిసింది. అదికూడా రెండో దశలో ఉండడం వల్ల ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పడంతో శస్త్ర చికిత్స చేయించాము. బిడ్డ కోలుకుంది అనేలోగా.. ఆ క్యాన్సర్ మహమ్మారి మా వారికి సోకింది. ఇన్నాళ్లు ఆయన సంపాదనతోనే ఇంటిని నడుపుకుంటూ ఇద్దరి బిడ్డలను పెద్ద చేశాను. ఆయన మంచాన పడడంతో పూటగడవడం కూడా కష్టంగా మారింది. ఓవైపు కుటుంబాన్ని నెట్టుకురావడం, మరోవైపు భర్త, కుమార్తెకు మందుల ఖర్చులు.. అన్ని వైపులా ఇబ్బందుల సుడిగుండంలో చిక్కుకున్నాము. ఆర్థికంగా సతమతమవుతోన్న వారి కుటుంబ పరిస్థితిపై దాతలు స్పందించి సాయం చేయాలని అర్థిస్తోంది నల్గొండ జిల్లా మిర్యాలగూడెం శాంతినగర్‌కు చెందిన ఆనబత్తుల పద్మజ.
A family need for help : మిర్యాలగూడ శాంతినగర్‌కు చెందిన ఆనబత్తుల యాదగిరి, పద్మజ దంపతులకు మౌనిక, ముఖేష్ సంతానం. యాదగిరి ఓ వస్త్ర దుకాణంలో గుమస్తాగా పనిచేస్తుండగా.. పద్మజ ఏఎన్ఎంగా (ఒప్పంద)పనిచేస్తుంది. వీరి కుమారుడు ఇంజినీరింగ్ వరకు చదివి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. కుమార్తె డిగ్రీ పూర్తి చేసింది. ఉన్నంతలో చింతలేకుండా హాయిగా సాగిపోతున్న వారి కుటుంబంపై క్యాన్సర్ మహమ్మారి పంజా విసిరింది. పెళ్లి చేసి అత్తవారింటికి పంపుదామనుకున్న కుమార్తెను ఆస్పత్రిపాలు చేసింది.
డిగ్రీ పూర్తి చేసి పీజీ చదువుతున్న మౌనికకు పెళ్లి చేసేందుకు 2017 ఆమె తల్లిదండ్రులు నిశ్చయించారు. సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. అయితే ఆమెకు నాలుకపై చిన్న కురుపు రావడంతో వైద్యులను సంప్రదించారు. మందులు వాడగా... తగ్గినట్టే తగ్గి మరలా తిరగబెట్టింది. పరీక్షలు చేయించగా... క్యాన్సర్ రెండో దశలో ఉన్నట్లు తేలింది. ఈ వార్తతో సంతోషంగా వారి ఉన్న కుటుంబం పెద్ద కుదుపునకు లోనయ్యింది. వైద్యుల సలహాలతో ఆమెకు శస్త్రచికిత్స చేయించారు. ఆమె క్యాన్సర్‌ను జయించింది కానీ.. మాట సక్రమంగా రాలేదు సరికదా.. వైద్యులు మరింత జాగ్రత్తగా చూడాలని చెప్పడం వల్ల గాజుబొమ్మవలె సాకుతూ వస్తున్నారు.
నాకు 2017లో క్యాన్సర్ వచ్చింది. ఆపరేషన్ చేశారు. ఇప్పుడు మాట్లాడేందుకు కూడా కష్టంగా ఉంది. బాగా చదువుకుని ఉద్యోగం చేసి తల్లిదండ్రులను సంతోషంగా చూసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు నన్నే వాళ్లు చంటి పిల్లలూ చూసుకోవాల్సిన పరిస్థితి. ఎవరైనా దాతలు స్పందించి ఆర్థికంగా సాయపడాలని కోరుతున్నాము. మౌనిక
బిడ్డ ప్రాణాలతో దక్కింది.. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నారు అనుకుంటున్న సమయంలో మరో పిడుగులాంటి వార్త వినిపించింది. గతేడాది డిసెంబర్లో యాదిగిరికి దవడ లోపల కురుపు రావడంతో పరీక్షలు చేయించగా క్యాన్సర్ అని తేలింది. అప్పటికే ఆర్థికంగా.. మానసికంగా కుంగిపోయిన ఆ కుటుంబం ఆ వార్తతో మరింత కుదేలైంది. వెంటనే శస్త్ర చికిత్స చేయాలని చెప్పడంతో ఉన్నదంతా ఖర్చుచేసి ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం అతడిని చంటిబిడ్డలాగే చూసుకోవాల్సిన పరిస్థితి.
భర్త, కుమార్తె క్యాన్సర్ బారిన పడడంతో ఆర్థికంగా చితికిపోయామని.. వారి వైద్య ఖర్చులతో పాటు పూటగడవడానికి ఇబ్బందిగా ఉందని పద్మావతి కన్నీటి పర్యంతమవుతోంది. ప్రభుత్వం, దాతలు స్పందించి తోచిన సాయం చేయాలని అశ్రునయనాలతో అర్థిస్తోంది.
ఇదీ చూడండి: ఈనాడు కథనానికి స్పందన.. నిరుపేద వైద్య విద్యార్థినికి ఆర్థికసాయం