Looking For Donors Help : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కాల్వపల్లి తండాకు చెందిన ఇస్లావత్ కిషన్ నాయక్... గ్రామ పంచాయతీలో ఒప్పంద కార్మికుడిగా పనిచేసేవాడు. అతనికి భార్య శాంతి, నాలుగో తరగతి చదువుతున్న కుమార్తె పూజిత, రెండో తరగతి చదువుతున్న కుమారుడు లక్కీ ఉన్నారు. గతేడాది నవంబర్ 2న గ్రామంలోని ఓ వీధి దీపం ఆర్పేందుకు కిషన్ నాయక్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. పనిలో ఉండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా జరిగి ప్రమాదానికి గురయ్యారు. చేతులు, కాళ్లు, పొట్ట, ఛాతీ భాగంలో బలమైన గాయాలు కావడంతో హుటాహుటిన మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్సలో భాగంగా వైద్యులు రెండు చేతులను తొలగించారు. సుమారు మూడు నెలలకు పైగా ఆస్పత్రిలోనే చికిత్స అందించారు. కిషన్ నాయక్ కాళ్లు, పొట్టకు తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఇంటి వద్దే మంచానికే పరిమితమయ్యాడు.
పూటగడవని పరిస్థితి..
గ్రామపంచాయతీలో ఒప్పంద కార్మికుడిగా పని చేస్తే నెలకు రూ. 8,500 వచ్చేవని బాధితుడు కిషన్ నాయక్ తెలిపారు. ప్రస్తుతం మంచానికే పరిమితం కావటంతో చికిత్స ఖర్చులు భరించటం కష్టంగా మారిందన్నారు. ఇప్పటివరకు సుమారు 5 లక్షల వరకు వైద్య ఖర్చులు కాగా... నెలవారీ డ్రెసింగ్ కోసం రూ.15 వేలకు పైగా ఖర్చు అవుతోందని అంటున్నారు. రెక్కల కష్టం మీదే బతికే తాము.. పూట గడవని స్థితిలో ఉన్నామని.. దాతలు స్పందించి సాయం చేయాలని కోరుతున్నారు.
విద్యుత్ దీపాలు ఆర్పేందుకు స్తంభం ఎక్కిన సమయంలో షాక్ తగలడం వల్ల తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటి వరకు వైద్య ఖర్చులు సహా ఇతర ఖర్చులకు సుమారు రూ.5లక్షలు అయింది. మాకు ఆస్తులేమీ లేవు. రెక్కల మీద ఆధారపడి బతుకున్న కుటుంబం మాది. కూలికెళ్తేనే పూట గడుస్తుంది. ఇప్పుడు అది కూడా కోల్పోయాము. ఎవరైనా దాతలు స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. -కిషన్ నాయక్, బాధితుడు
మా కుటుంబాన్ని పోషించే ఆయనే మంచాన పడ్డాడు. మాకు ఎవ్వరూ దిక్కులేరు. నాకు ఇద్దరు పిల్లలు. కూలికెళ్తేనే రోజు గడుస్తుంది. పనికిపోతే నా భర్తను చూసేటోళ్లు లేరు. చేతిలో రూపాయి కూడా లేదు. పూట గడవడమే కష్టంగా ఉంది. -శాంతి, బాధితుడి భార్య
విద్యుత్ శాఖ, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సాయం అందలేదని బాధితుడి కుటుంబసభ్యులు తెలిపారు. ఇల్లు గడవడమే కష్టంగా మారిందని....దాతలు ఎవరైనా సాయం అందించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి : Bride Groom Died In Accident : పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడిని బలిగొన్న మృత్యువు