వట్టెం భూనిర్వాసితులతో చర్చలు సఫలమయ్యాయి. తిమ్మాజిపేట వద్ద వట్టెం భూనిర్వాసితులతో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి చర్చలు జరిపారు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామన్న హామీతో నిర్వాసితులు వెనక్కి తగ్గారు. ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విరమించుకున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు ప్రాజెక్టు పనులు జరగనివ్వబోమని నిర్వాసితులు తేల్చి చెప్పారు.
మల్లన్నసాగర్ మాదిరిగా పరిహారం ఇవ్వాలని డిమాండ్
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా బిజినేపల్లి, తిమ్మాజిపేట మండలాల్లో వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. మల్లన్నసాగర్ మాదిరిగా తమకు పరిహారాన్ని అందజేయాలని వట్టెం భూనిర్వాసితులు 21 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. జలాశయం నిర్మిస్తున్న మూడు ప్యాకేజీల కంపెనీల ముందు టెంటు వేసి బైఠాయించడం వల్ల పనులు ఆగిపోయాయి. ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన గడువు లక్ష్యం కూడా ఎక్కువ అవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే హామీతో వెనక్కి
రోజు రోజుకు నిరసనను ఉద్ధృతం చేసిన నిర్వాసితులు... ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. పాదయాత్ర చేపట్టారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి హామీతో నిర్వాసితులు ముట్టడి విరమించుకున్నారు.
ఇదీ చూడండి: తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్‌రావు ఖరారు