Revanth Reddy Speech in Kalwakurthi Public Meeting : పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రెండు అవకాశాలు ఇస్తే కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చేసేందేమీ లేదని దుయ్యబట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన పాలమూరు విజయభేరి యాత్ర(Palamuru Vijayabheri Yatra) సభలో ఆయన మాట్లాడారు. పాలమూరు జిల్లాలో ఇప్పటికీ పల్లేర్లు మొలుస్తున్నాయని.. జిల్లాలో వలసలు ఆగలేదన్నారు.
ఈ పాలమూరు బిడ్డగా అడుగుతున్నానని.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలే(Congress Six guarantees) ప్రధాన అభ్యర్థులుగా జిల్లాలో 14కు 14 సీట్లు కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. జిల్లా పసిడి పంటల జిల్లాగా అభివృద్ది చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రాజెక్టులు కట్టి లక్షలాది ఎకరాలకు నీళ్లించిందని తెలిపారు. కేసీఆర్ రూ.లక్ష కోట్లు మింగి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ప్రజలందరికీ కనిపిస్తోందని.. నిన్న మేడిగడ్డ(Medigadda Project) కుంగిందని.. నేడు సుందిళ్ల పగుళ్లు పట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ రావాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే.. తెచ్చానని చెప్పుకునే సీఎం కేసీఆర్కు తెలంగాణ సమాజం రెండు అవకాశాలు ఇచ్చింది. ఈ రెండు అవకాశాల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కానీ.. దళితులకు మూడెకరాల భూమి కానీ.. ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం కానీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసింది కానీ లేదు. ఈ నిర్వాకం వల్లే పాలమూరు జిల్లాలో ఇప్పటికీ పల్లేర్లు మొలుస్తూనే ఉన్నాయి. వలసలు సాగుతూనే ఉన్నాయి. - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Bhatti Vikramarka Powerful Speech At Kalwakurthi : తెలంగాణ ప్రజలు కన్న కలలు నిజం కావాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతోనే సాధ్యమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో.. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు నీళ్లు, ఉద్యోగాలు, నిధులు ఆగమయ్యాయని, పేదలకు ఇల్లు రాలేదని ధ్వజమెత్తారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భట్టి ప్రసంగించారు.
బీసీల జన గణన చేయాలని పార్లమెంట్‌లో మనందరి కోసం రాహుల్ గాంధీ గొంతెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. తండాల్లో ఉన్న లంబాడీ సోదరీ సోదరులకు రిజర్వేషన్లు కల్పించిన ఇందిరమ్మను గుర్తు చేసుకుని చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi) ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఇంటింటికీ తీసుకువెళ్లి కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.