నల్లమల అడవిని వల్లకాడును చేసి... ఇక్కడ బతికే చెంచులను దిక్కుమాలిన వారిని చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని ఆరోపించారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. నాగర్కర్నూల్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు నల్లమల అటవీ ప్రాంతంలోని మల్లాపూర్, వటవర్లపల్లిలో ఆయన పర్యటించారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున పార్లమెంట్లో ప్రస్తావిస్తానని రేవంత్ అన్నారు. చెంచులతో మాట్లాడి వారి జీవన శైలి, సమస్యల గురించి తెలుసుకున్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు నల్లమలను నాశనం చేయడానికి పూనుకున్నాయని ఆరోపించారు. యురేనియం తవ్వితే నీళ్లు కలుషితమవుతాయని... అటవీ సంపద నాశనమవుతుందన్నారు. ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో హరితహారం చేపట్టిందని.. అలాంటపుడు వందల ఏళ్లనాటి నల్లమల అడవిని ఎలా నాశనం చేస్తుందో వివరించాలన్నారు. ప్రజలందరూ.. ఏకమై ఇలాంటి దుశ్చర్యను ఆపడానికి సంసిద్ధం కావాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: తండ్రీకొడుకుల పార్టీకి స్వస్తి పలికితేనే అభివృద్ధి