Rahul Gandhi Speech at Kalwakurthy : ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలంతా కలగన్నారని.. కానీ నేడు కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ అయ్యిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కల్వకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరీ సభలో రాహుల్ గాంధీ(Rahul Gandhi Meeting) ప్రసంగించారు. అధికార బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Congress Election Campaign 2023 : తెలంగాణ ఏర్పాటు కల్వకుంట్ల కుటుంబానికే మేలు జరిగిందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఉద్యోగాలు, పదవులు అన్నీ కేసీఆర్ కుటుంబానికే దక్కాయని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోటీ నడుస్తోందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లు దోచుకుందని ఆరోపించారు. రూ.లక్షన్నర కోట్లతో కట్టిన ప్రాజెక్టు అప్పుడే బీటలు పడుతోందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చి పేదల భూములు లాక్కున్నారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. తెలంగాణలో ముందుగా కేసీఆర్‌ను పదవి నుంచి దింపి బైబై చెప్పాలన్నారు. కేసీఆర్‌ను పదవి నుంచి దింపాక ప్రజల సొమ్మును ఎంత లూటీ చేశారో ప్రశ్నించాలన్నారు. కేసీఆర్ లూటీ చేసిన ప్రజల సొమ్మును వసూలు చేసి.. మళ్లీ ప్రజలకు పంచుతామని పేర్కొన్నారు. సంపద కొందరి చేతుల్లోనే కాకుండా ప్రజలందరికీ పంచి పెడతామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు.
Congress Vijayabheri Meeting in Kalwakurthy : కేసీఆర్ వలే.. మోదీ కూడా మాయమాటలు చెప్పారని రాహుల్ గాంధీ విమర్శించారు. విదేశాల నుంచి నల్లధనం తెచ్చి పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని మోదీ అన్నారని.. మోదీ చెప్పినట్లు పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు పడ్డాయా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మధ్య అవగాహన, ఒప్పందం ఉందని దుయ్యబట్టారు. మోదీ సర్కార్ తెచ్చిన ఎన్నో బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని పేర్కొన్నారు.
మోదీ సర్కార్ తనపై 24 కేసులు పెట్టిందని.. తన ఎంపీ పదవి పోగొట్టి ప్రభుత్వ ఇంటి నుంచి తనను ఖాళీ చేయించిందని తెలిపారు. రాష్ట్రంలో ఎంతో అవినీతికి పాల్పడిన కేసీఆర్‌పై మాత్రం ఒక్క కేసు కూడా లేదని మండిపడ్డారు. బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ఇప్పుడు చెప్తోంది.. రెండు శాతం ఓట్లు వచ్చే బీజేపీ.. ఓబీసీని సీఎం ఎలా చేస్తుందని ప్రశ్నించారు.
రాష్ట్రాభివృద్ధి కోసం మహిళలు ఎంతో కష్టపడుతున్నారని.. రాష్ట్రం కోసం, కుటుంబం కోసం కష్టపడే మహిళలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అందుకే మహిళలకు ప్రతినెలా రూ.2500 ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు.కేంద్రంలోని బీజేపీ సర్కార్ గ్యాస్ సిలిండర్‌ను రూ.వెయ్యికి పెంచిందని.. కాంగ్రెస్ గెలిస్తే.. రాష్ట్రంలో రూ.500కే గ్యాస్ సిలిండర్ వస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ గెలిస్తే మహిళలందరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని.. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు నెలకు రూ.2వేల వరకు ఆదా అవుతుందన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతుల సంక్షేమం గురించే ఆలోచిస్తుందని.. రైతుభరోసా కింద రైతులకు ఎకరానికి ఏటా రూ.15 వేలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కౌలురైతులకు కూడా రూ.15 వేలు ఇస్తుందని.. వృద్ధులు, వితంతువులకు ప్రతినెలా రూ.4 వేల పింఛను ఇస్తామని స్పష్టం చేశారు.
"రాష్ట్రంలో కేసీఆర్ బాగా అవినీతికి పాల్పడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ. లక్ష కోట్ల రూపాయలను దొచుకున్నాడు. కేసీఆర్ ప్రజల నుంచి లూటీ చేసిన సొమ్మును తిరిగి వసూలు చేస్తాం. మళ్లీ ప్రజలకే పంచుతాం". - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత