శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కోసం జెన్కో సన్నాహాలు చేస్తోంది. సుమారు రెండు నెలల తర్వాత ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 20 రాత్రి పదిన్నర గంటల సమయంలో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభంచింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నాలుగో యూనిట్ పూర్తిగా దెబ్బతింది. ఆరో యూనిట్ ప్యానల్ బోర్డు కాలిపోయింది. ప్లాంట్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు జెన్కో అధికారులు.
సోమవారం నుంచి విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. మొదట ఒకటి, రెండు యూనిట్ల ద్వారా 300 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. రేపటి నుంచి ట్రయల్ రన్ నిర్వహించి అన్ని సవ్యంగా సాగితే.. సోమవారం నుంచి ఉత్పత్తిని మొదలు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.
తొలిదశలో ఒకటి, రెండు యూనిట్లు, రెండో దశలో 3,5,6 యూనిట్లు ప్రారంభించాలని యోచిస్తున్నారు. నాలుగో యూనిట్ పూర్తిగా దెబ్బతినగా.. ఆ యూనిట్ నిర్వహించడం ఇప్పట్లో సాధ్యం కాదంటున్నారు అధికారులు. ప్రస్తుతానికి ట్రయల్ రన్ కొనసాగిస్తున్నామని.. విజయవంతమైతే రెండు యూనిట్లు సోమవారం నుంచి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు జెన్కో హైడల్ సీఈ సురేశ్ తెలిపారు.
శ్రీశైలం జలాశయం నిండుగా ఉన్న సమయంలో ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా రోజూ 20 మిలియన్ యూనిట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. అగ్నిప్రమాదం కారణంగా ఆగస్టు 20 నుంచి శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.
గత సంవత్సరం ఆగస్టులో 398.1 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేయగా.. సెప్టెంబర్‌లో 487 మిలియన్ యూనిట్లు, అక్టోబర్‌లో 500 మిలియన్ యూనిట్లు, నవంబర్‌లో 232 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరిగింది.
ఇవీచూడండి: ఓవర్‌లోడ్‌తోనే శ్రీశైలం అగ్నిప్రమాదం!: సీఐడీ