Plastic prevention : ఒకసారి వాడి పారేసే(సింగిల్ యూజ్) ప్లాస్టిక్‌ను కేంద్రం జులై 1 నుంచి నిషేధించిన నేపథ్యంలో రాష్ట్రంలోని టైగర్ రిజర్వుల్లో ఈ నిబంధన అమలుకు అటవీశాఖ సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలో అమ్రాబాద్ అభయారణ్యంలో ప్లాస్టిక్ చెక్ పోస్టులు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్-శ్రీశైలం రహదారిలోని దుర్వాస, దోమలపెంటలో వీటిని ఏర్పాటు చేయాలని అమ్రాబాద్ టైగర్ రిజర్వు అధికారులు నిర్ణయించారు.
జులైలో అవగాహన కల్పించి ఆగస్టు నుంచి ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌పై నిషేధాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కార్యాచరణలో భాగంగా మన్ననూరు దాటాక వచ్చే దుర్వాసలో తనిఖీలుంటాయి. ప్రయాణికులు, పర్యాటకుల దగ్గర సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నీళ్ల సీసాలు, సంచులు, చిప్స్ కవర్లు వంటి ఉంటే తీసేసుకుంటారు. శ్రీశైలం వైపు నుంచి హైదరాబాద్‌కు వచ్చేవారి వద్ద నుంచి దోమలపెంటలో స్వాధీనం చేసుకుంటారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం: ‘‘పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే మరోవైపు ప్రజలకు ఇబ్బందుల్లేకుండా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉంచబోతున్నాం. ప్లాస్టిక్ నీళ్ల సీసాలు తీసుకుని గాజు సీసాల్లో నీళ్లు ఇస్తాం. ప్లాస్టిక్ కవర్లకు బదులు జ్యూట్, వస్త్ర సంచులు ఉంటాయి. వీటికి నిర్ణీత రుసుములు చెల్లించాలి. ఇంటి నుంచి బయల్దేరేటప్పుడే ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ తేవద్దు. అలాంటి వాటిని ఎక్కడ పడితే అక్కడ పారేయవద్దని, స్టీలు, రాగి వంటి లోహ, తిరిగి వినియోగించే ప్లాస్టిక్ నీళ్ల సీసాలు.. వస్త్ర, జనపనార సంచులు తెచ్చుకోవాలని కోరతాం. జులైలో అవగాహన కల్పించి ఆగస్టు నుంచి నిబంధనలు అమలు చేస్తాం’’ అని అమ్రాబాద్ ఎఫ్‌డీఓ రోహిత్ వెల్లడించారు.
నీళ్లకు రూ.20, సీసాతో రూ.100: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నీళ్ల బాటిల్‌తో వెళితే చెక్‌పోస్టులో తీసేసుకుంటారు. 'ప్లాస్టిక్‌ను పారేయను..అమ్రాబాద్ అడవి అంటే నాకిష్టం’ అనే నినాదాలతో ఉండే గాజుసీసాలో మంచి నీళ్లు నింపి దుర్వాసలో ఇస్తారు. దానికి రూ.100 తీసుకుంటారు. 850 మిల్లీలీటర్ల ఆర్‌ఓ మంచినీళ్ల ధర రూ.20గా నిర్ణయించారు. దోమలపెంట చెక్‌పోస్టులో ఖాళీ గాజుసీసా తిరిగిస్తే రూ.80 తిరిగిస్తారని అటవీశాఖవర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో జ్యూట్ బ్యాగ్‌లు, వస్త్ర సంచుల వినియోగం పెంచేందుకు మన్ననూరులో వాటి తయారీ కేంద్రాన్ని ఎఫ్‌డీఓ రోహిత్ ఏర్పాటు చేయించారు. ఓ కార్పొరేట్ ఆసుపత్రి నుంచి నెలకు 3 వేల వరకు జనపనార ఫైల్ ఫోల్డర్ల ఆర్డర్ వచ్చిందని రోహిత్ తెలిపారు.
ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా కవ్వాల్ టైగర్ రిజర్వు: కవ్వాల్ టైగర్ రిజర్వులోకి రాకపోకలు సాగించడానికి అనేక దారులుండటం కొంత క్లిష్టమైన అంశమేనని జన్నారం ఎఫ్‌డీఓ మాధవరావు అన్నారు. గతంలో మాదిరి టైగర్ రిజర్వుల్లోకి ఇతరులు రాకపోకలు సాగించకుండా గట్టిగా నియంత్రిస్తున్నామని చెప్పారు. ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌కు ఇటీవలే కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆయన తెలిపారు.