నాగర్కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ చౌహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది సమయానికి వస్తున్నారా.. లేదా అని ఆరా తీశారు. దవాఖానాలోని ఐసీయూ, ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ గదులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితులను తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడకుండా ధైర్యంగా కరోనాను ఎదుర్కోవాలని వారికి సూచించారు. ఇతర వ్యాధిగ్రస్తులకు అందించే చికిత్సలపై కూడా ఆరా తీశారు.
అనంతరం పెద్దకొత్తపల్లి మండలంలోని చంద్రకల్ గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. గ్రామంలోని అన్ని వార్డులు తిరిగి.. పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల గ్రామ సర్పంచ్, కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వేదిక నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాకపోవడం వల్ల అసహనం వ్యక్తం చేశారు. నెలరోజుల్లో పనులు పూర్తి కాకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీధుల్లో చెత్తాచెదారం, మురుగు పేరుకుపోవడం వల్ల ఈగలు, దోమలు ప్రబలి రోగాలు వచ్చే అవకాశం ఉందని... గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.
ఇవీ చూడండి: 'తెలంగాణ కోసం త్యాగం చేసిన వేలమందికి ఇలాగే ఇస్తారా?'