యురేనియం వెలికితీత మీకోసమే అంటున్న ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీతో చెంచులను బయటకు పంపే ప్రయత్నం చేస్తుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ప్యాకేజీ వల్ల ఒరిగేదేమి ఉండదన్నారు. ప్రభుత్వాలు చెంచుల అభివృద్ధిని విస్మరించి అడవిలో ఎక్కడ బోర్లు పడతాయి? ఎక్కడ రహదారులు వేయాలో పరిశీలిస్తుందే తప్ప చెంచుల అభివృద్ధి గురించి పట్టించుకోవటం లేదని విమర్శించారు. 1950 నుంచి నల్లమల ఏజెన్సీగా ఉన్నా.. చెంచులకు విద్యా, ఉద్యోగాలలో సరైన న్యాయం జరగలేదన్నారు.
నల్లమలను నమ్ముకొన్న చెంచుల జీవితాలు ఎదుగుబొదుగు లేకుండా ఉన్నాయని, నల్లమలను అమ్ముకొన్నవారు బాగుపడ్డారన్నారు. యురేనియం వెలికితీతకు అనుమతులివ్వమని అసెంబ్లీలో తీర్మానం చేశారని, అయినా వెలికితీత ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుందన్నారు. ఒకవేళ యురేనియం వెలికితీసే పరిస్థితి వస్తే అడ్డుకొని తీరతామన్నారు. కార్యక్రమంలో యురేనియం వ్యతిరేక జేఏసీ నాయకులు నాసరయ్య, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు బాలకిష్టయ్య, ప్రజాగాయకులు గోపాల్, టీజేఎస్ నేతలు భగవతిరెడ్డి, ద్రోణాచారి పాల్గొన్నారు.