కార్పొరేట్ కంపెనీలకు మేలు కలిగేలా నూతన వ్యవసాయ చట్టాలు ఉన్నాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు. ఈ చట్టాల వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గగ్గలపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ హనుమంత్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. దళారుల వద్దకు వెళ్లి రైతులు మోసపోవద్దని ఆయన సూచించారు.
పత్తిని కేంద్రం కొనుగోలు చేయకుండా నల్లగా మారిందని కొత్త కొర్రీలు పెడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుందామంటే కేంద్రం రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. సీఎం రైతుల పక్షపాతిగా ఉంటూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ అధికారి బాలమణి, తెరాస నాయకులు పాల్గొన్నారు.