రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా, తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అధికారులను ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోలుపై ఆయన సమీక్ష నిర్వహించారు.
వాటి కొరత లేకుండా చూడండి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. రైతు బంధు సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు స్వయంగా దగ్గర ఉండి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం ఎగుమతి కోసం లారీల కొరత, బ్యాగుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ప్రతి గింజను కొంటాం:
రైతులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కరోనా కష్టకాలంలోనూ పంటను కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని ఆయన అన్నారు. ఈ సమీక్షలో డీసీఓ పత్యనాయక్, ఉమ్మడి జిల్లా సింగిల్ విండో సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనాతో వానరాలకు తిండి కరవు.. ఆకలి తీర్చిన సీఐ