నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఏలూరు వద్ద మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్ మూడో పంపు వద్ద శ్రీశైలం తిరుగు జలాల ఒత్తిడి వల్ల నీరు చేరిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి మంత్రి పంప్‌హౌస్‌ను పరిశీలించారు. ప్రాజెక్టులో చిన్న లోపం వల్లనే శ్రీశైలం తిరుగు జలాలు పంపు హౌసులోకి వచ్చాయన్నారు. ప్రతిపక్ష నాయకులు పని కట్టుకొని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని మండిపడ్డారు. ఇలా దుష్ప్రచారం చేయడం తగదని హితవు పలికారు.
ఎలక్ట్రానిక్ పరికరాల్లో చిన్నచిన్న లోపాలు జరుగుతుంటాయని దానిని వెంటనే సరి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని మంత్రి అన్నారు. తాగు, సాగునీటి కోసం రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పంప్‌హౌస్‌లోకి చేరిన నీటిని తోడి, తక్షణమే మరమ్మతులు చేసి మోటార్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని... అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రాజెక్టులపై ఎంతో అవగాహన ఉందని... ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
ఇదీ చూడండి: ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ప్రవాహం