నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రం మీదుగా జడ్చర్ల-కోదాడ జాతీయ రోడ్డు విస్తరణకు చేపట్టిన భూసర్వేను నిర్వాసితులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రోడ్డు నిర్మాణంతో నివాసాలు కోల్పోతే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వం చెల్లించే పరిహారం చాలా తక్కువని.. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఆందోళన చేయటంతో అధికారులు సర్వేను కొనసాగించకుండా వెనుదిరిగారు.
రహదారిపై నిరసనతో వాహనాలు నిలిచిపోవడంతో ఘటనా స్థలికి ఆర్డీవో రాజేశ్ కుమార్, సీఐ నాగరాజు, ఎస్సై బాలకృష్ణ, సిబ్బంది చేరుకున్నారు. నిరసనకారులతో మాట్లాడి.. వారం రోజుల్లో గ్రామసభ నిర్వహించి అందరి నిర్ణయం తీసుకుంటామని చెప్పటంతో నిర్వాసితులు ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి: నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడి