KCR Speech in Kollapur Public Meeting at Nagarkurnool district : నాగర్‌కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పర్యటించారు. తొలుత పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం కొల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల చరిత్రలో ఇవాళ సువర్ణాక్షర లిఖితమని కేసీఆర్ పేర్కొన్నారు. పాలమూరు ప్రజలంటే ఒక్కప్పుడు ముంబయి, హైదరాబాద్‌లో అడ్డా కూలీలుగా పేరు అని.. ఇవాళ తెలంగాణ ప్రజలే ఇతర రాష్ట్రాల వారిని పనిలో పెట్టుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు.
CM KCR on Palamuru Rangareddy Project : పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించానని కేసీఆర్ గుర్తు చేశారు. కొందరు నేతల వల్లే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru Rangareddy Project) నిర్మాణం ఆలస్యమైందని వివరించారు. గత పాలకులు పాలమూరు జిల్లా నీటి వాటా గురించి ఎప్పుడూ అడగలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో నా తొలిపాదయాత్ర జోగులాంబ గద్వాల నుంచే చేశానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇంటిదొంగలే మనకు ప్రాణగండం తెచ్చారని కేసీఆర్ ఆరోపించారు.
KCR on Joint Palamuru District : పదవులకు ఆశపడి సమైక్య రాష్ట్ర సీఎంలను ఎవరూ ప్రశ్నించలేదని కేసీఆర్ దుయ్యబట్టారు. మనం ఎత్తులో ఉన్నాం నీళ్లు రావని.. ఈ జిల్లా నేతలే మాట్లాడారని గుర్తు చేశారు. మన నీళ్లు ఏపీకి తరలివెళ్తుంటే ఈ జిల్లా నాయకులు జెండాలు ఊపారని విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే మోదీకి చేతకావటం లేదని మండిపడ్డారు. విశ్వగురు అని చెప్పుకునే మోదీ (Narendra Modi).. 9 ఏళ్లుగా మన నీళ్ల వాటా తేల్చలేదని కేసీఆర్ ధ్వజమెత్తారు.
KCR Fires on Prime Minister Narendra Modi : 10 ఏళ్లుగా కృష్ణా ట్రైబ్యునల్‌కు (Krishna Tribunal) ఎందుకు ప్రతిపాదనలు పంపటం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతలను పాలమూరు జిల్లా ప్రజలు నిలదీయాలని అన్నారు. దత్తత తీసుకున్న సీఎంలు కూడా ఈ జిల్లాలకు చేసిందేమీ లేదని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టుపై ఈ జిల్లా నాయకులే కేసులు వేశారని ఆరోపించారు. చేతనైతే కమలం నాయకులు.. నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి నీటివాటా అడగాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
KCR Nirmal Tour : 'ఎన్నికలు వస్తున్నందున ఇష్టారీతిన మాట్లాడుతున్నారు'
మొట్టమొదట విద్యుత్ సమస్యపై దృష్టి పెట్టి అధిగమించామని కేసీఆర్ పేర్కొన్నారు. పింఛన్లు క్రమంగా పెంచుకుంటూ పోతున్నామని చెప్పారు. ఉన్న తెలంగాణను పోగొట్టింది.. కాంగ్రెస్ నేతలు కాదా అని ప్రశ్నించారు. 60 ఏళ్లల్లో మహబూబ్‌నగర్ జిల్లాకు వైద్య కళాశాల వచ్చిందా? అని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ సీఎంలు జిల్లాకొక వైద్య కళాశాల తెచ్చారా? అని పేర్కొన్నారు. తమిళనాడు పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం పెడుతున్నారని.. పథకం బాగుందని తెలంగాణలోనూ అమలు చేయాలని (Breakfast Scheme Telangana) నిర్ణయించామని కేసీఆర్ వెల్లడించారు.
Breakfast Scheme for Students in Telangana : తమిళనాడులో ఐదో తరగతి వరకే అల్పాహరం పెడుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో పదో తరగతి వరకు అమలు చేయాలని నిర్ణయించామని వివరించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందినప్పుడు తొలిసారి ఎంతో సంతోషపడ్డానని.. మళ్లీ ఇవాళ పాలమూరు గడ్డపై కృష్ణా జలాలు పారుతుంటే అంత సంతోషం కలిగిందని చెప్పారు. కొల్లాపూర్ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తామని.. ఈ ప్రాంతంలో పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయనున్నట్లు కేసీఆర్ వివరించారు.
మరోవైపు నాగర్‌కర్నూల్ కొల్లాపూర్- పెద్దకొత్తపల్లి మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 7 కిలోమీటర్ల మేర భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సీఎం కేసీఆర్ సభ ముగిసిన తర్వాత నేతలు, ప్రజలు తిరుగు ప్రయాణం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే వెల్దొండ వద్ద ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం గంట ముందుగానే పోలీసులు వాహనాలు నిలిపివేశారు. దీంతో వెల్దొండ బస్టాండ్‌లో భారీగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
"కొల్లాపూర్ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తాం. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రూ.15 లక్షల ప్రత్యేక నిధులు ఇస్తాం. కొల్లాపూర్‌కు పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేస్తాం. మహబూబ్‌నగర్‌లో జేఎన్టీయూ ద్వారా ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తాం. పాలమూరు జిల్లా ఎప్పుడూ నా గుండెల్లో ఉంటుంది. తెలంగాణ సాధించే యోధుడిగా నన్ను తీర్చిదిద్దింది పాలమూరు." - కేసీఆర్, ముఖ్యమంత్రి
KCR Medak District Tour : 'అవగాహన లేని ప్రతిపక్షాల వల్ల.. రాష్ట్ర ప్రగతి గాడి తప్పే ప్రమాదం'